ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో అత్యల్పస్థాయిలో కన్పిస్తున్న మేఘాలు
ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో తగ్గుతున్న వర్షపాతం
న్యూఢిల్లీ: కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నప్పటికీ వాస్తవంగా చూస్తే దేశవ్యాప్తంగా వర్షపాతం అనుకున్న స్థాయిలో ఉండబోదని కృత్రిమ ఉపగ్రహాల ఛాయాచిత్రాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటికే దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, ఇక విస్తారంగా వర్షాలు కురవడమే తరువాయి భాగమని భారత వాతావరణ శాఖ ఓవైపు చెబుతుంటే అసలు కురవడానికి ఆకాశంలో మేఘాలు కరువయ్యాయని శాటిలైట్ ఫొటోలు విస్మయకర విషయాన్ని బహిర్గతంచేస్తున్నాయి.
జూలై 11న(శనివారం) తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం భారత గగనతలంలో 70 నుంచి 80 శాతందాకా మేఘాలు లేనేలేవు. ఆకాశం మేఘావృతమైందనే మాటకు తావేలేదని ఫొటోల్లో స్పష్టమవుతోంది. ఉన్న కొద్దిమేర మేఘాల కారణంగానే పలు రాష్ట్రాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వర్షం పడిన రెండు,మూడు రోజులకే ఇలా మేఘాలు ముఖం చాటేయడం వెనుక అసలు కారణం ఏమైఉంటుందనే చర్చ భారతీయుల్లో మొదలైంది. ఇందుకు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం సమాధానం చెబుతోంది.
వర్షాలు తగ్గడానికి కారణం?
హిందూ సముద్రం మీదుగా తేమతో కూడిన గాలుల తీరుతెన్నులకు అనేవి ఈ సీజన్‌లో వర్షాలను పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. రుతుపవనాల కారణంగా ఏర్పడే అల్పపీడన అక్షరేఖ సైతం వర్షాలకు మరో కారణంగా నిలుస్తోంది. ఈ అక్షరేఖ వెంటే వర్షాలు ఎక్కువగా కురిసే ఆస్కారముంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై శక్తివంతమైన తుపాను నెలకొంది. ఇది భారత ఉపఖండంపై పరుచుకోవాల్సిన తేమ, వాయుమండల ప్రసరణను దూరంగా నెట్టేస్తోంది. దీంతో అల్పపీడన అక్షరేఖ అనేది బలహీనపడుతోంది. అందుకే దేశవ్యాప్తంగా వర్షాలు పడే సానుకూల వాతావరణం ఏర్పడక వర్షపాత తక్కువగా నమోదవుతోంది. మళ్లీ భారత గగనతలంలో వాయుమండల ప్రసరణ అనుకూల వాతావరణం ఏర్పడేదాకా మరికొద్దిరోజులపాటు మధ్య భారతం, దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా పడే వీలుంది.
సవ్యంగా సాగని విస్తరణ
రుతుపవనాల విస్తరణ ఈసారి అస్తవ్యస్తంగా సాగింది. సాధారణంగా ఏటా జూలై 8వ తేదీకల్లా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాలి. కానీ ఈసారి ఒక రోజు ఆలస్యంగా దేశం నలుమూలలకూ రుతుపవనాలు అడుగుపెట్టాయి. దీంతో జరగాల్సిన పాక్షిక నష్టం జరిగిపోయింది. ఈసారి జూన్‌లో దాదాపు 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో గత కొన్నాళ్లలో ఇంత తక్కువ వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. అయితే జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా పడిన భారీ వర్షాలతో లోటు వర్షపాతం అనేది తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ లోటు కేవలం 14 శాతానికి పరిమితమైంది. అయితే ఇప్పటికీ దేశవ్యాప్తంగా వర్షపాతం అనేది సమస్థాయిలో లేదు. పశ్చిమ భారత, తూర్పు భారత రాష్ట్రాల్లో తగు స్థాయిలో వర్షాలు పడ్డాయిగానీ మధ్యభారతంలో గణనీయస్థాయిలో లోటు వర్షపాతం నమోదైంది.
తర్వాత ఏం జరగొచ్చు?
దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే జూలై నెలలోనూ వర్షపాతం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే ఆరుశాతం తగ్గుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఎల్‌నినో రోజురోజుకూ బలపడుతుండటంతో ప్రపంచ వాతావరణంలో తీరుతెన్నులు ప్రతికూలంగా మారే ప్రమాదముంది. ఈ ప్రతికూల పరిస్థితి భారత్‌లో వర్షాలను తగ్గించవచ్చు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. వర్షాల మరో విడత మొదలయ్యేదాకా ఉష్ణోగ్రతలు ఇలా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాలు అదృశ్యం
కాలేదుగానీ వాటికి బలహీన దశ నడుస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. పసిఫిక్ మహాసముద్రంపై వాతావరణ వ్యవస్థలు బలహీనమయ్యేకొద్దీ భారత ఉపఖండంపై వరుణుడి ప్రేమ పెరుగుతుందని శాస్త్రవేత్తలు సెలవిచ్చారు.


