జంతర్‌మంతర్ వద్ద 22వ రోజుకు చేరిన నిరసన
14 రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన శనివారం 22వ రోజుకు చేరుకుంది. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జంతర్ మంతర్ వద్దకు చేరుకొని నిరసన కారులకు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది.
తాను ఆధునిక గాంధీనో లేదా హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని వాంగ్‌చుక్ ఈ సందర్భంగా అన్నారు. కేరళ మాజీ మంత్రి థామస్ ఐజాక్, త్రిపుర ప్రతిపక్ష నాయకుడు జితేంద్ర చౌదరి కూడా జంతర్‌మంతర్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ప్రకాశ్ రాజ్, ఐజాక్, జితేంద్ర చౌదరి నిరసనకారులతో మాట్లాడారు.
పరీక్షల్లో పదే పదే జరుగుతున్న అవకతవకలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకమైన, నిష్పక్షపాత మైన, విశ్వసనీయమైన పరీక్షా విధానం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామ ని ప్రకటించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్నామని వెల్లడించారు. సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు.
నిద్రించినప్పుడు రక్తపోటు 109/72 ఎంఎం హెచ్‌జీ గాను, కూర్చున్నప్పుడు 106/74 ఎంఎం హెచ్‌జీ గాను నమోదైంది. హృదయ స్పందన నిమిషానికి 81 సార్లు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి 78 ఎంజీ/డీఎల్ గాను రికార్డయ్యింది. ఆయన బరువు 58.45 కిలోలకు చేరుకుంది. నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 7.5 కిలోల బరువు తగ్గారు. వాంగ్‌చుక్ శరీరంలో నీటి శాతం బాగానే ఉందని, మానసికంగా చురుకుగా ఉన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు.
జీవితానికి మీరే హీరో కావాలి
దీక్ష కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు వాంగ్‌చుక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత బలహీనంగా ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ తన సంకల్పంలో మార్పు రాలేదన్నారు. సోషల్ మీడియాలో ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. చాలామంది తనను 21వ శతాబ్దపు గాంధీ లేదా ఆధునిక గాంధీ అని పిలుస్తున్నారని, మరికొందరు తనను హీరో అంటున్నారని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని వెల్లడించారు. తాను గాంధీని కాదు, హీరోని కూడా కాదని వివరణ ఇచ్చారు. బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించే ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని స్పష్టంచేశారు. ఇతరుల్లో హీరోల కోసం వెతకడం మానేసి, పౌరులుగా బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు. ‘‘జీవితానికి మీరే హీరో అవ్వండి. పౌరులుగా మీ బాధ్యతలను నెరవేర్చండి’’అని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు న్యాయం జరిగేలా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రజలకు సూచించారు. ‘‘మీరు ప్రతిరోజూ ఇక్కడికి రాలేకపోతే, కనీసం ఒక్క రోజైనా జంతర్ మంతర్ వద్ద మాతో చేరండి. మీరు ఢిల్లీకి రాలేకపోతే, ఎక్కడ ఉన్నా ఉపవాసం పాటించి మీ సందేశాన్ని పంచుకోండి’’అని వాంగ్‌చుక్ కోరారు. నిరసనకారులు లేవనెత్తిన సమస్యలను ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించేలా ఒత్తిడి పెంచడానికి జూలై 20న పార్లమెంటు వరకు ప్రతిపాదించిన యాత్రలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.


