న్యాయమూర్తులపై తీవ్ర పదజాలంతో దూషణలు
పేపర్లను గాల్లోకి విసిరేస్తూ కోర్టు హాల్‌లో అనుచిత ప్రవర్తన
లక్నో ఏసీపీపై ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశాలివ్వాలంటూ డిమాండ్
బలవంతంగా బయటకు పంపించిన కోర్టు సిబ్బంది
పిటిషనర్‌పై తమకు సానుభూతి ఉందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
అతడి ప్రవర్తనపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టబోమని వెల్లడి
పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం ఓ పిటిషనర్ తీవ్రస్థాయిలో వీరంగం సృష్టించాడు. విచారణ సమయంలో న్యాయమూర్తులపైకి పేపర్లు విసిరేయడంతోపాటు తీవ్ర పదజాలంతో దూషణలకు దిగాడు. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని కోర్టు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే సదరు పిటిషనర్ ప్రవర్తనపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టబోమని, అతడిపై తమకు సానుభూతి మాత్రమే ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మెరిట్స్ ఆధారంగా అతడి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రబల్ ప్రతాప్ దాఖలు చేసిన దరఖాస్తును భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 173(4) కింద ప్రైవేట్ ఫిర్యాదుగా పరిగణించాలని కింది కోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దాంతో ప్రబల్ ప్రతాప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశాడు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
నల్లకోటుతో వచ్చిన పిటిషనర్ ప్రబల్ ప్రతాప్ న్యాయవాదులు మెడలో ధరించే టై ఏదీ కట్టుకోలేదు. స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాడు. న్యాయమూర్తులు అతడి పేరు, వివరాలను తెలుసుకుని ‘స్వయంగా వాదనలు వినిపిస్తారా’అని ప్రశ్నించారు. అవునని సమాధానం ఇచ్చాడు. అనంతరం వాదనలు వినిపిస్తూ ఆరంభం నుంచే తీవ్ర అసహనంతో, దూకుడుగా వ్యవహరించాడు. న్యాయపరమైన అంశాలు కాకుండా ధర్మాసనాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లక్నో ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని డిమాండ్ చేశాడు. ‘మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్.. లక్నోలోని వికాస్ నగర్ ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. ఎందుకంటే నేను సార్వ¿ౌముడిని’అని బిగ్గరగా అరుస్తూ చెప్పాడు.
నన్ను ఆదేశిస్తున్నావా? మమ్మల్ని ఆదేశిస్తున్నావా?
పిటిషనర్ వాదనలు, ప్రవర్తన పట్ల ధర్మాసనం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ.. ‘నువ్వు నన్ను ఆదేశిస్తున్నావా? మమ్మల్ని ఆదేశిస్తున్నావా?’అని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ బదులిస్తూ.. ‘నా వైపు నుంచి చెప్పాల్సింది అంతే.. అంతా రికార్డుల్లో ఉంది’అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అతడి ప్రవర్తన మరింత శృతి మించింది. తన చేతిలో ఉన్న కేసుకు సంబంధించిన పేపర్ల కట్టను న్యాయమూర్తులపైకి విసిరేశాడు. కోర్టు హాల్‌లో ఆ పేపర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ‘వీటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వండి’అంటూ ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషించాడు.
దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ సంఘటన పట్ల ధర్మాసనం ఎంతో సంయమనంతో వ్యవహరించింది. పిటిషనర్‌పై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదని జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ‘మేము రికార్డులను పరిశీలించాం. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణాలు కనిపించడం లేదు. కాబట్టి ప్రబల్ ప్రతాప్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’అని ధర్మాసనం తమ తీర్పులో తేల్చిచెప్పింది. పిటిషనర్ తీవ్ర ఆందోళన, నిరాశలో ఉన్నాడని, అతడి పట్ల తమకు కేవలం సానుభూతి మాత్రమే ఉందని జస్టిస్ విశ్వనాథన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

గతంలో సీజేఐపైకి బూటు
సుప్రీంకోర్టులో వ్యక్తుల అనుచిత ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. 2025లో ఓ న్యాయవాది అప్పటి ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్‌పై బూటు విసిరాడు. కోర్టు సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తరువాత ఆ న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. బార్ కౌన్సిల్ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే చర్యలు ప్రారంభించింది. ఈ ఘటన కంటే ముందు 2009లో జస్టిస్ అరిజిత్ పసాయత్‌పై ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. 1968లో మరో వ్యక్తి చేతిలో కత్తితో న్యాయమూర్తుల వైపు దూసుకెళ్లాడు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అతడిని అడ్డుకున్నారు.


