న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలై నెలలోనూ సాధారణం కంటే తక్కువ వానలే కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం తెలిపింది. దేశంలో దీర్ఘకాల(1971–2020) సగటు వర్షపాతం జూలైలో 280.4 మిల్లీ మీటర్లు కాగా, ఇందులో 94 శాతం మేర కురిసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
అయితే, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే తూర్పు– మధ్య భారతం, తూర్పు ద్వీపకల్ప ప్రాంతాల్లో మాత్రం సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. మిగతా చోట్ల సాధారణం కంటే తక్కువ వానలు కురుస్తాయన్నారు. దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో జూలైలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని చెప్పారు. జూన్‌లో దేశం మొత్తమ్మీద 40 శాతం వరకు లోటు వర్షపాతం నమోదవ్వగా, మధ్య భారతంలో ఈ లోటు అత్యధికంగా 50.4 శాతం వరకు ఉందని తెలిపారు.


