జూలైలో ఎగుమతులు జూమ్‌!  | India exports surged 19. 63percent to 44. 24 billion dollars in July 2026 | Sakshi
Sakshi News home page

జూలైలో ఎగుమతులు జూమ్‌! 

Aug 14 2026 12:22 AM | Updated on Aug 14 2026 12:22 AM

India exports surged 19. 63percent to 44. 24 billion dollars in July 2026

19.6 శాతం జంప్‌; 44.24 బిలియన్‌ డాలర్లుగా నమోదు

దిగుమతులూ పైపైకి.. 17.2% అప్‌ 

ఆరు నెలల గరిష్టానికి వాణిజ్యలోటు

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌–ఇంజినీరింగ్‌ గూడ్స్, సముద్ర ఉత్పత్తుల దన్నులతో జూలైలో భారత్‌ ఎగుమతులు భారీగా ఎగబాకాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 19.63% వృద్ధితో 44.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 జూన్‌ (3.12% అప్‌) తర్వాత ఎగుమతులు ఈ స్థాయిలో వృద్ధి చెందడం ఇదే తొలిసారి. 

మరోపక్క, దిగుమతులు కూడా పెరగడంతో వాణిజ్య లోటు 6 నెలల గరిష్టానికి చేరింది. 31.98 బిలియన్‌ డాలర్లను తాకింది. క్రూడాయిల్‌ అధిక దిగుమతుల ప్రభావంతో జూలైలో మొత్తం దిగుమతులు 17.52% ఎగసి 76.22 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలివీ.. 

→ జూలైలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 72–95 డాలర్ల మధ్యలో కదలాడింది. 17.64 శాతం పెరుగుదలతో 18.31 బిలియన్‌ డాలర్ల విలువైన ముడిచమురును భారత్‌ దిగుమతి చేసుకుంది. మొత్తం దిగుమతుల్లో ఇది 24 శాతం కావడం గమనార్హం. 
→ పశ్చిమాసియా దేశాలకు కూడా జూలైలో ఎగుమతులు 8.62 శాతం పెరిగి 5.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
→ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 7 బిలియన్‌ డాలర్లకు (67.64 శాతం వృద్ధి), ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు 6 బిలియన్‌ డాలర్లకు (57.4% అప్‌), ఇంజినీరింగ్‌ గూడ్స్‌ ఎగుమతులు 12.24 బిలియన్‌ డాలర్లకు (17.7 శాతం వృద్ధి) చేరాయి. 
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూలై కాలంలో ఎగుమతులు 17 శాతం జంప్‌ చేసి 173.78 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. దిగుమతులు సైతం 19.27 శాతం ఎగసి 292.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 118.6 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 
→ కాగా, జూలై నెలలో సరీ్వసుల ఎగుమతులు 35.89 బిలియన్‌ డాలర్లుగా, దిగుమతులు 18.94 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

పసిడి దిగుమతులపై సుంకాల ఎఫెక్ట్‌
కస్టమ్స్‌ సుంకాల భారీ పెంపు ప్రభావంతో జూలైలో బంగారం, వెండి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్‌ దిగుమతులు కేవలం 4.77% వృద్ధితో 4.16 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్‌ దిగుమతులు ఏకంగా 66.1% దిగజారి 171.68 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. మే 13న ఈ రెండు విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను 6% నుంచి 15%కి పెంచిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్‌–జూలై కాలంలో 15.17 బిలియన్‌ డాలర్ల (32.4% అప్‌) విలువైన పసిడి దిగుమతులు జరగ్గా... వెండి దిగుమతులు 50.8% ఎగసి 718.42 మిలియన్‌ డాలర్లను తాకాయి.  

అమెరికా, చైనాలకు రయ్‌... 
జూలైలో అమెరికాకు భారత్‌ నుంచి 9.02 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. గతేడాది జూలైతో పోలిస్తే 12.85% వృద్ధి చెందాయి. అమెరికా నుంచి మన దేశానికి దిగుమతులు సైతం 18.1% పెరిగి 5.5 బిలియన్‌ డాలర్లను తాకాయి. అమెరికా జూలై 24 నుంచి భారత్‌పై 10% అదనపు సుంకాలను విధించడం తెలిసిందే. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇక చైనాకు మన ఎగుమతులు 2.2 బిలియన్‌ డాలర్లకు (64.57% వృద్ధి) చేరాయి. దిగుమతులు 34.42% ఎగసి 14.67 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement