వివాదంలో బిల్‌గేట్స్ కుమార్తె.. 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదా? | Bill Gates Daughter Phoebe Gates Faces Cookie Stuffing Allegations Over Phia Startup | Sakshi
Sakshi News home page

వివాదంలో బిల్‌గేట్స్ కుమార్తె.. 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?

Aug 13 2026 6:47 PM | Updated on Aug 13 2026 7:29 PM

 Bill Gates Daughter Phoebe Gates Faces Cookie Stuffing Allegations Over Phia Startup

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ కుమార్తె 'ఫీబీ గేట్స్' వివాదంలో చిక్కుకుంది. ఆమె స్థాపించిన స్టార్టప్ ఫియా (Phia) కుకీ స్టఫింగ్‌’కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి.

ఫీబీ గేట్స్, సోఫియా కియానీ కలిసి ఫియా స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఏఐతో నడిచే డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్‌. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూపన్లు వెతకడం, మంచి ధరలు చూపించడం, ఉత్పత్తుల వివరాలు అందించడం దీని పని. అయితే ఇప్పుడు ఈ కంపెనీ 'కుకీ స్టఫింగ్' అనే అనుమానాస్పద మార్కెటింగ్ పద్ధతిని ఉపయోగించిందనే ఆరోపణలు రావడంతో వార్తల్లో నిలిచింది.

కుకీ స్టఫింగ్ అంటే ఏంటి?
సాధారణంగా మనం ఒక కంపెనీ ఇచ్చిన కూపన్ లేదా లింక్ ద్వారా షాపింగ్ చేస్తే.. ఆ కొనుగోలు ఆ కంపెనీ ద్వారా జరిగిందని గుర్తించడానికి బ్రౌజర్‌లో ఒక చిన్న ట్రాకింగ్ ఫైల్‌ను కుకీగా ఉంచుతారు. దీని ద్వారా కంపెనీకి కొంత కమిషన్ వస్తుంది. కానీ.. మనం ఆ కంపెనీ కూపన్ ఉపయోగించకపోయినా.. ఆ లింక్‌పై క్లిక్ చేయకపోయినా సాఫ్ట్‌వేర్ మన బ్రౌజర్‌లో కుకీని పెట్టి, ఆ కొనుగోలు తమ వల్లే జరిగిందని చూపిస్తే దాన్ని 'కుకీ స్టఫింగ్' అంటారు. అంటే.. తాము చేయని అమ్మకానికి కూడా కమిషన్ తీసుకునే ప్రయత్నం అన్నమాట.

20 ఏళ్లు జైలు శిక్ష?
అమెరికాలో ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. కుకీ స్టఫింగ్ అనేది ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కిందికి వస్తుంది. కాబట్టి నేరం రుజువైతే ఏకంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ఆరోపణలపైనా ఫియా సంస్థ స్పందిస్తూ.. ఈ సమస్యను తాము గుర్తించినట్లు పేర్కొంది. ఇది ఒక సాంకేతిక లోపమని స్పష్టం చేస్తూ.. దీనికి కారణమైన ఫీచర్లను తొలగించమని.. భాగస్వామ్య సంస్థలను నిధులను వెనక్కు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు చెప్పింది.

నిజానికి ఈ కుకీ స్టఫింగ్‌ విషయం వ్యవస్థాపకులు ఏడు నెలలకు ముందే తెలుసని సమాచారం. ఇదే నిజమైతే ఫీబీ గేట్స్‌ చిక్కుల్లో పడ్డట్టే.  అయితే ఈ ఫీచర్లను జులైలో నిలిపివేయడంతో.. కంపెనీ ఆదాయం భారీగా తగ్గిందని తెలుస్తోంది. అంటే ఫియా ఇప్పటికే భారీ లాభాలను గడించినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement