డబ్బు, పేరు కాదు.. అందుకే 'రిచ్ డాడ్' బుక్ రాశా! | Robert Kiyosaki Shares Powerful Life Lesson on Purpose Beyond Money | Sakshi
Sakshi News home page

డబ్బు, పేరు కాదు.. అందుకే 'రిచ్ డాడ్' బుక్ రాశా!

Aug 13 2026 4:38 PM | Updated on Aug 13 2026 5:17 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Powerful Lesson on Life

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ''రాబర్ట్ కియోసాకి'' ఒక ట్వీట్‌లో చాలా సింపుల్‌గా ఒక లోతైన విషయాన్ని చెప్పారు. ఆయన ఒకప్పుడు రాక్ అండ్ రోల్ బిజినెస్‌లో పనిచేస్తూ.. ది పోలీస్, వాన్ హాలెన్, ఐరన్ మైడెన్ వంటి ప్రముఖ బ్యాండ్ల కోసం ఉత్పత్తులు తయారు చేసేవారు. ఆ సమయంలో ఆయనకు మంచి డబ్బు వచ్చేది, ఫేమస్ బ్యాండ్లతో కలిసి ఉండే అవకాశం ఉండేది. జీవితం చాలా సరదాగా, విజయవంతంగా ఉన్నప్పటికీ.. తనలో మాత్రం ఏదో లోటు ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఆ సమయంలోనే ఆయన డాక్టర్ ఆర్. బక్‌మినిస్టర్ ఫులర్‌ను కలిశారు. కొంతకాలం పాటు ఆయన దగ్గర చదువుకున్నారు. ఆ సమయంలో తాను చెప్పిన మాటలు కియోసాకిని బాగా ప్రభావితం చేశాయి. మన జీవితం కేవలం మన కోసం, మన డబ్బు కోసం, మన సుఖం కోసం మాత్రమే కాదని అర్థం చేసుకున్నారు.

చాలామంది జీవితంలో ఒక దశకు వచ్చిన తర్వాత ''నేను ఇది ఎందుకు చేస్తున్నాను?'', ''నా జీవితానికి అసలు అర్థం ఏంటి?'' అని ఆలోచిస్తారు. కియోసాకి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. డబ్బు ఉన్నా, పేరు ఉన్నా, ఆనందంగా ఉన్నా తనకు ఏదో లోటుగా అనిపించింది. దాంతో ఆయనకు అర్థమైన విషయం ఏమిటంటే.. డబ్బు సంపాదించడం మాత్రమే జీవిత లక్ష్యం కాదు. మన వల్ల ఇతరులకు ఎంత ఉపయోగం జరుగుతోంది అనేదే అసలు విషయం.

ఆ ఆలోచనను తన జీవితంలో అమలు చేసిన తర్వాతే కియోసాకి క్యాష్‌ఫ్లో అనే బోర్డ్ గేమ్‌ను రూపొందించారు, అలాగే రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రాశారు. వీటి ద్వారా ప్రజలకు డబ్బు గురించి, పెట్టుబడుల గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి కొత్తగా ఆలోచించే అవకాశం కల్పించారు.

అంటే.. తనకు తెలిసిన విషయాలను తన దగ్గరే ఉంచుకోకుండా, వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా తన జీవితానికి ఒక అర్థం దొరికిందని ఆయన చెప్పాలనుకున్నారు.

కియోసాకి చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మన జీవిత లక్ష్యం ఎప్పుడూ మనకు వెంటనే అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటాం. కానీ ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకు వెళ్తే.. మన దారి మనకే క్రమంగా అర్థమవుతుంది. జీవితంలో ఎంత డబ్బు సంపాదించాం అనేదాని కంటే, మన వల్ల ఎంతమంది జీవితాల్లో మంచి మార్పు వచ్చింది అనేది కూడా ముఖ్యమే.

చివరికి ''నీ జీవిత లక్ష్యం ఏంటి? దేవుడు నిన్ను ఈ భూమిపైకి ఎందుకు పంపాడు?'' ఇవి ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయాలు అని కియోసాకి తన ట్వీట్ ముగించాడు. మొత్తం మీద జీవితం అంటే కేవలం మన కోసం బతకడం కాదు. మన ప్రతిభ, మన అనుభవం, మన సంపాదన, మన జ్ఞానం ద్వారా ఇతరులకు ఉపయోగపడేలా జీవించినప్పుడే మన జీవితానికి నిజమైన అర్థం వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement