ఒకపుడు అది వెండికొండ. 360 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో కఠినమైన రాళ్లను సైతం పగలగొట్టి వెండిని సొంతం చేసుకునేవారు. లాస్ ఏంజిలిస్ నిర్మించడానికి ఇది సహాయపడిందని నమ్మేవారు. అదే కాలిఫొర్నియాలోని సెర్రో గోర్డో (లావైన కొండ). కానీ కాలక్రమంలో గనుల కార్యకలాపాలు తగ్గడంతో 20వ శతాబ్దం మధ్య నాటికి ఇది 'దెయ్యాల పట్టణం'గా (Ghost Town) మారిపోయింది. 2018లో ఈ సెర్రో గోర్డో' (Cerro Gordo) అనే నిర్జనమైన చారిత్రక మైనింగ్ పట్టణాన్ని సుమారు రూ. 13.3 కోట్లకు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బ్రెంట్ అండర్‌వుడ్ (Brent Underwood) కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు వెనుక ఉద్దేశం ఏంటి? వ్యాపారం చేయాలనుకున్నారా? తెలుసుకుందాం.
2018లో తన 30 ఏళ్ల వయసులో, సొంత పొదుపు మొత్తంతో పాటు పెట్టుబడిదారుల సహాయంతో ఈ పట్టణాన్ని కొనుగోలు చేశారు బ్రెంట్. మొదట దీనిని ఒక వ్యాపార మరియు పునరుద్ధరణ (Restoration) ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. పాత కాలపు కట్టడాలను బాగుచేసి, పర్యాటకులు 'ఓల్డ్ వెస్ట్' (Old West) చారిత్రక అనుభూతిని పొందేందుకు అనువుగా మార్చాలని భావించారు. కానీ కోవిడ్ అతని ప్రణాళికలను మార్చేసింది.
మొదట్లో ఆయన అక్కడ శాశ్వతంగా నివసించాలని అనుకోలేదు. కానీ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో, ఆ పట్టణాన్ని పర్యవేక్షించే కేర్‌టేకర్ రోబర్ట్ తన భార్య దగ్గరకు వెళ్లాలనుకోవడంతో, బ్రెంట్ అండర్‌వుడ్ అక్కడ తాత్కాలికంగా ఉండటానికి వెళ్లి, ఆపై అక్కడే స్థిరపడి పునరుద్ధరణ పనులు ప్రారంభించాడు. కేవలం ఒక వ్యాపార ప్రాజెక్ట్‌గానే కాకుండా, కాలిఫోర్నియా మైనింగ్ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ పట్టణాన్ని, దానిలోని పాత వస్తువులను,కట్టడాలను కాలగర్భంలో కలిసిపోకుండా, దాని కథలు కనుమరుగవకుండా భద్రపరచడమే (Preservation) ఆ చరిత్రను పరిరక్షించడమే తన ముఖ్య లక్ష్యమని అండర్‌వుడ్ తెలిపారు.

సెర్రో గోర్డో డీల్ ఎలా?
2018లో ఒక స్నేహితుడు అర్ధరాత్రి పంపిన "నువ్వు ఒక పాడుబడిన పట్టణాన్ని కొనాలనుకుంటున్నావా?" అన్న మెసేజ్, ఆ ఆస్తిపై అండర్‌వుడ్‌కు ఆసక్తి మొదలైంది. ముందు ఈ మెసేజ్‌ను ఏదో జోక్ అనుకున్నాడు. కానీ సెర్రో గోర్డో గురించి పరిశోధన చేసిన తర్వాత, దాని చరిత్ర , భవిష్యత్ అవకాశాలపై అతనికి ఆసక్తి కలిగింది.పైగా అండర్‌వుడ్‌కు ఆతిథ్య రంగంలో అనుభవం , చారిత్రక ఆస్తులపై ఆసక్తి ఉండేవి. ఆ నివాస ప్రాంతంలోని కొన్నిభాగాలను పునరుద్ధరించి, దాని పాత పశ్చిమ ప్రాంత చరిత్రను కేంద్రంగా చేసుకుని ఒక గమ్యస్థానాన్ని సృష్టించే అవకాశాన్ని అతను చూశాడు.
అంతే 2018 జూలైలో డీల్ కుదుర్చుకున్నాడు. బ్రెంట్ అండర్‌వుడ్ (Brent Underwood)తో పాటు, జోన్ బియర్ (Jon Bier) అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఇందులో భాగస్వాములు. ఈ ఒప్పందంలో తన సొంత పొదుపులో అధిక భాగాన్ని పెట్టుబడిగా పెట్టి, పలువురు పెట్టుబడి దారులను కూడా తీసుకొచ్చాడు. ఈ డీల్‌లో 360 ఎకరాల భూమి , 1865 నాటి 22 చారిత్రక కట్టడాలు ఉన్నాయి.ముఖ్యంగా హోటల్, చర్చి , జనరల్ స్టోర్‌తో పాటు, పాత గనుల పని ప్రదేశాలతో సహా అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ పట్టణంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఆ పట్టణ రహస్యాలను "Ghost Town Living" అనే YouTube ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ ఛానల్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించ కోవడం విశేషం.
ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటం
దెయ్యాల నగరంగా ఎలా మారింది?
కాలిఫోర్నియాలోని ఇన్యో పర్వత శ్రేణిలో లోన్ పైన్ సమీపంలో ఉన్న సెర్రో గోర్డో, 19వ శతాబ్దపు గనుల విపణి ఉచ్ఛస్థితికి చెందినది. 19వ శతాబ్దంలో వెండి, సీసం (Lead), జింక్ గనుల ఆవిష్కరణతో ఈ పట్టణం వేలాది మంది కార్మికులతో కాలిఫోర్నియాలోనే ఒక ప్రధాన వెండి మైనింగ్ కేంద్రంగా వికసించింది. ఇక్కడి సంపద సమీపంలోని లాస్ ఏంజెలెస్ అభివృద్ధికి కూడా తోడ్పడింది. ఈ ఆవిష్కరణ వేలాది మంది గని కార్మికులను మరియు ఇతర కార్మికులను ఈ స్థావరానికి తీసుకువచ్చింది. తదనంతరం సెర్రో గోర్డో కాలిఫోర్నియాలోని ముఖ్యమైన వెండి గనుల ప్రాంతాలలో ఒకటిగా మారింది. ఇక్కడి గనుల నుండి వచ్చిన సంపద సమీపంలోని లాస్ ఏంజిల్స్ అభివృద్ధికి కూడా దోహదపడింది. గనుల తవ్వకం కార్యకలాపాలు క్షీణించడంతో, జనాభా తగ్గిపోయి, చివరికి ఆ నివాస ప్రాంతం నిర్జనమైపోయింది. 20వ శతాబ్దం మధ్య నాటికి, సెర్రో గోర్డో ఒక పాడుబడిన ఘోస్ట్ టౌన్‌గా మారిపోయింది. ఈ పట్టణంలో పాత హోటల్, చర్చి, జనరల్ స్టోర్ మరియు గనులు ఉన్నాయి. దీని చరిత్రలో తుపాకీ కాల్పులు, హింస, మరణాలు కూడా ఉన్నాయి. ఇక్కడి స్మశానవాటికలో వందలాది సమాధులు ఉన్నాయి.
ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు


