అంతరిక్ష రేసులో కొత్త మలుపు.. జిన్నా-1తో పాకిస‍్థాన్‌ రెడీ | Pakistan names first lunar rover Jinnah 1 | Sakshi
Sakshi News home page

అంతరిక్ష రేసులో కొత్త మలుపు.. జిన్నా-1తో పాకిస‍్థాన్‌ రెడీ

Aug 13 2026 2:56 PM | Updated on Aug 13 2026 3:18 PM

Pakistan names first lunar rover Jinnah 1

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలి లూనార్‌ రోవర్‌కు అధికారికంగా పేరును ప్రకటించింది స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (సుపార్కో). దానికి “జిన్నా-1” అని నామకరణం చేసింది. సుపార్కో తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్త పోటీలో వచ్చిన సూచనల నుంచి ఈ పేరు ఎంపికైంది. దేశం నలుమూలల నుంచి 4,000 కుపైగా ప్రతిపాదనలు వచ్చాయి. “జిన్నా-1” పేరును ఏడుగురు ప్రతిపాదించారు.

విజేతను డ్రా ద్వారా ఎంపిక చేశారని అధికారులు తెలిపారు. బహావల్‌నగర్‌కు చెందిన తయ్యబ్ కరీమ్ (17) విజేతగా నిలిచాడు. సుపార్కో ఛైర్మన్ మాట్లాడుతూ.. “జిన్నా-1” పేరు పాకిస్థాన్ వ్యవస్థాపకుడు ఖైద్-ఎ-ఆజమ్ మహ్మద్ అలీ జిన్నాకు నివాళి అని చెప్పారు. ఈ పేరు అంతరిక్ష అన్వేషణలో పాకిస్థాన్ సంకల్పం, పురోగతి, కొత్త దిశలకు ప్రతీక అని చెప్పుకొచ్చారు.

సుపార్కో తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ తొలి లూనార్‌ రోవర్‌ను 2029లో చైనా చాంగ్‌ఈ-8 మిషన్ ద్వారా చంద్రుడిపైకి పంపనున్నారు. “జిన్నా-1” చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాస్త్రీయ పరిశోధనలు చేపడుతుంది.

పాకిస్థాన్ నిర్మించిన ఈ చంద్ర రోవర్ ప్లాస్మా, రేడియేషన్, చంద్ర ఉపరితల భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేస్తుంది. భవిష్యత్ చంద్ర పరిశోధనలు, చంద్రుడిపై మానవ ఉనికికి సంబంధించిన కీలక ప్రయోగాల్లో కూడా పాత్ర పోషిస్తుంది. “జిన్నా-1” పాకిస్థాన్ అంతరిక్ష అన్వేషణ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని సుపార్కో తెలిపింది. దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలకు మార్గం చూపుతుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement