కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పాఠశాల విద్యా వ్యవస్థలో 2028 నుంచి భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పాఠ్యాంశాలు, సిలబస్‌తో పాటు చరిత్ర, సాహిత్య బోధనా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు బెంగాలీ సాహిత్యం, చరిత్ర పాఠ్యపుస్తకాల సిలబస్‌లో సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ప్రతిపాదిత మార్పుల ప్రకారం బెంగాలీ సాహిత్య సిలబస్‌లో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ప్రముఖ కవిత ‘ఆఫ్రికా’ స్థానంలో ‘శివాజీ ఉత్సవ్’ను చేర్చే అవకాశం ఉంది. అలాగే నాటక రచయిత శరత్ చంద్ర సేన్ గుప్తా రచించిన ‘సిరాజ్ ఉద్దౌలా’కు బదులుగా ‘బంగార్ ప్రతాపాదిత్య’ను సిలబస్‌లో పొందుపరచాలని భావిస్తున్నారు. మరోవైపు చరిత్ర సిలబస్‌లోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ విద్యావేత్త శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం, ఆయన అందించిన సేవలను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రతిపాదించారు. అలాగే, 8వ తరగతి చరిత్ర సిలబస్‌లో సింగూర్ ఉద్యమానికి సంబంధించిన కొంత భాగాన్ని తొలగించి, ఆ స్థానంలో భారత స్వాతంత్ర్య పోరాటంలోని కొన్ని ఘట్టాలను చేర్చాలని సూచించారు.
పాఠ్యపుస్తకాల్లో చారిత్రక, సాహిత్య ప్రముఖుల ఎంపిక, ప్రాతినిధ్యంపై ఈ ప్రతిపాదనలు రాజకీయంగానూ, విద్యావర్గాల్లోనూ చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ మార్పులన్నీ ప్రస్తుతం ప్రాథమిక ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. సిలబస్ సమీక్ష ప్రక్రియ పూర్తయి, సంబంధిత అధికారుల ఆమోదం లభిస్తేనే తుది నిర్ణయం వెలువడనుంది. 2028 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యలో ఈ నూతన సంస్కరణలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వ అధికారులు యోచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నిశ్చితార్థమైన జంట అనుమానాస్పద మృతి


