కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలు స్పీకర్ వద్ద “నిజమైన టీఎంసీ” హోదా కోరేందుకు వేసుకున్న ప్రణాళికపై ఓ రాజ్యాంగ నిపుణుడు పలు ప్రశ్నలు లేవనెత్తారు. పార్టీ నుంచి విడిపోయిన వర్గానికి అలాంటి హోదా ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానిదేనని ఆయన చెప్పారు.
రెబల్ ఎంపీల బృందం తమకు 19 మంది లోక్‌సభ సభ్యుల మద్దతు ఉందని ప్రకటించింది. “నిజమైన టీఎంసీ” పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు కోరుతూ సోమవారం స్పీకర్ ఓం బిర్లాను కలుస్తామని తెలిపింది.
మాజీ లోక్‌సభ ప్రధాన కార్యదర్శి, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచార్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం టీఎంసీలో నెలకొన్న పరిస్థితుల్లో లోక్‌సభ స్పీకర్‌కు ఎలాంటి పాత్ర లేదని చెప్పారు.
“నిజమైన టీఎంసీ ఏదో నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానిదే. సుభాష్ దేశాయ్ కేసులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టంగా చెప్పారు. పార్టీకి చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాలు తమదే అసలు పార్టీ అని చెప్పిన సందర్భంలో.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన వ్యవహారం పరిష్కరించే సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు” అని అభిప్రాయపడ్డారు.
రెబల్ వర్గం తమ వద్ద అత్యధిక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని, పార్టీ సంస్థాగత విభాగంపై తమ నియంత్రణ ఉందని పేర్కొంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం రెండు వర్గాల వాదనలు విని కేసును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, ఆ నిర్ణయం న్యాయపరమైన పరిశీలనను తట్టుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ప్రత్యేక వర్గంగా పరిగణించలేం
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం వారిని ప్రత్యేక వర్గంగా పరిగణించలేమని ఆచార్య చెప్పారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఇప్పటికే లోక్‌సభలో స్థానాలు కేటాయించారని అన్నారు. ప్రస్తుతం తిరుగుబాటు వర్గానికి గుర్తింపు పొందిన ప్రత్యేక వర్గ హోదా లేకపోవడంతో వారు వేరుగా కూర్చునే ఏర్పాట్లు చేయలేమని ఆయన చెప్పారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేయడంతో టీఎంసీ సంక్షోభంలో పడింది. లోక్‌సభలో పార్టీకి 28 మంది సభ్యులు, రాజ్యసభలో 13 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ముగ్గురు రాజీనామా చేశారు.
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత రాజకీయ సహచరుల్లో ఒకరైన సుదీప్ బంద్యోపాధ్యాయ్ కూడా శనివారం రెబల్ వర్గంలో చేరారు. “నిజమైన టీఎంసీ” పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు కోరే ప్రయత్నాలకు ఆ వర్గం సిద్ధమవుతోంది.
పార్లమెంట్‌లో బెనర్జీకి విశ్వసనీయ సహచరుడిగా దీర్ఘకాలంగా గుర్తింపు పొందిన సీనియర్ పార్లమెంటేరియన్ బంద్యోపాధ్యాయ్.. రెబల్ ఎంపీ శతాబ్దీ రాయ్‌తో కలిసి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిశారు.
పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సవాలు మరింత పెంచుతున్న సమయంలో ఈ భేటీ జరిగింది. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. రెబల్స్‌కు చెందిన వర్గాలు.. లోక్‌సభలో ఆ బృందానికి బంద్యోపాధ్యాయ్ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాయని తెలిపాయి. తిరుగుబాటు ఎంపీలు సోమవారం బిర్లాను కలిసి “నిజమైన టీఎంసీ” పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు కోరనున్నట్లు ప్రకటించారు.


