కోల్‌కతా: తమ పార్టీకి చెందిన తిరుగుబాటు నాయకులపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పార్టీని వీడి బీజేపీకి మద్దతు ఇచ్చిన వారందరినీ దొంగలుగా వర్ణించారు. బీజేపీలో చేరి ఎన్నికలలో పోటీ చేయాలని రెబెల్స్‌కు సవాలు విసిరారు. కోల్‌కతాలోని బిర్లా ప్లానెటేరియం సమీపంలో మంగళవారం జరిగిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో తన మద్దతుదారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన బలం కార్యకర్తలే అంటూ వారికి సెల్యూట్ చేశారు.
"వారు బీజేపీలో చేరాలని నేను సవాలు విసురుతున్నాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజానికి నేను చాలా సంతోషిస్తాను. వారి స్థానాన్ని భర్తీ చేయడానికి నా దగ్గర చాలా మంది ఉన్నారు. టీఎంసీ గుర్తులపై గెలిచి, రెబెల్స్ పార్టీకి వెన్నుపోటు పొడిచారు. తప్పు తెలుసుకుని వారు తిరిగివస్తే, వారిని చేర్చుకునేందుకు నాకు అభ్యంతరం లేదని మమతా బెనర్జీ ప్రకటించారు. కాగా, అమరవీరుల దినోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో మమత మద్దతుదారులు తరలివచ్చారు. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వం కుట్రలు
తమ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. సోమవారం రాత్రి తుపాకులతో సుమారు 600 మంది బైకర్లు వేదికను ధ్వంసం చేయడానికి వచ్చారని వెల్లడించారు. "నిన్న రాత్రి నేను, అభిషేక్ ఇతర నాయకులతో కలిసి బీజేపీ నిరంతర దాడి నుంచి షహీద్ దివస్ వేదికను కాపాడాం. పోలీసులకు చాలాసార్లు తెలియజేసినప్పటికీ మాకు వారి నుంచి ఎలాంటి సహాయం అందలేదు. దీని వెనుక ఎవరి ఆదేశాలు పనిచేస్తున్నాయో మేము అర్థం చేసుకోగలం" అని ఆమె అన్నారు.
విద్యార్థులపై దాడులకు ఖండన
ఢిల్లీలో నిరసన తెలుపున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మమతా బెనర్జీ తప్పుబట్టారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడులు సరికాదన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని 'ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంగా వర్ణించారు. యువత పోరుతో ప్రధాని నరేంద్ర మోదీ దిగిరాక తప్పదని హెచ్చరించారు.
The energy is truly electric!
No amount of conspiracy or intimidation can ever weaken our resolve. We will continue to raise our voices against every injustice and stand shoulder to shoulder with those whose rights are denied.
United by purpose and strengthened by conviction,… pic.twitter.com/kyG4KfZgmp— All India Trinamool Congress (@AITCofficial) July 21, 2026
మమత తప్పు ఒప్పుకోవాలి
మమతా బెనర్జీ చేపట్టిన కార్యక్రమానికి రెండు కిలోమీటర్ల దూరంలో తిరుగుబాటుదారులు మేయో రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీని నాశనం చేశారంటూ అభిషేక్ బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. తన మేనల్లుడిని ప్రోత్సహించి మమత తప్పుచేశారని, ఆమె తప్పులే పార్టీ చీలిపోవడానికి కారణమయ్యాయని అన్నారు. "మమత వచ్చి తాను తప్పు చేశానని ఒప్పుకోనివ్వండి, మేమంతా ఆమె కాళ్లపై పడతాం" అని రెబెల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా వ్యాఖ్యానించారు. కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే మమతా బెనర్జీకి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
చదవండి: మోదీ నివాసం వద్ద రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్


