కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ కంటి చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై ఆయనపై నమోదైన కేసు విచారణ సందర్భంగా ఈ అభ్యర్థన తెరపైకి వచ్చింది.
న్యాయమూర్తి జస్టిస్ సౌగత భట్టాచార్య ఈ విజ్ఞప్తిని తిరస్కరించి, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్‌కేఎం మెడికల్ కాలేజీ వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. గత పదేళ్లుగా అమెరికాలో కంటి చికిత్స పొందుతున్నట్లు బెనర్జీ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న కీలక కేసుల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ ఈ విదేశీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రి నేత్ర వైద్య విభాగం అధిపతితో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి, వారి నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా పడింది. అయితే, విద్వేషపూరిత ప్రసంగాల కేసుకు సంబంధించి అక్టోబరు వరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ, దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: పాక్‌లో మరింత పేదరికం.. ప్రతి10 మందిలో ముగ్గురు..


