కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో తొలి ఏడాది నుంచి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఏఐసీటీఈ
రెండో ఏడాది డేటా స్ట్రక్చరే కీలకం.. కోర్ గ్రూపులకు డేటా విజువలైజేషన్
మూడో ఏడాది బిగ్ డేటా అనాలసిస్
ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన సరికొత్త సిలబస్
యూనివర్సిటీలకు ఏఐసీటీసీ మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12.53 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. వీరిలో 3.9 లక్షల మంది కంప్యూటర్ కోర్సుల్లో చేరేవారే. తెలంగాణలో 1.16 లక్షల సీట్లలో 70 శాతం కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలోనే చేరుతున్నారు. డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, కోర్ గ్రూపు విద్యార్థులు వీటిని ఓ పేపర్‌గా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిలబస్‌పై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేసి మారుతున్న కాలానికి అనుకూలంగా వీటిని తీర్చిదిద్దాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచించింది.
లీనియర్ ఆల్జీబ్రాపై ఫోకస్
కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో మొదటి ఏడాది నుంచి లీనియర్ ఆల్జీబ్రాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. ప్రస్తుతం ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, గ్రాఫిక్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాలన్నింటికీ లీనియర్ ఆల్జీబ్రానే పునాది వంటిది. ఏఐఎంఎల్‌లో వాడే టేబుల్స్, ఇమేజ్‌లు, వీడియోలు అంకెల రూపంలో ఉంటాయి. కంప్యూటర్ డేటాను మ్యాట్రిక్స్, వెక్టర్ల రూపంలో నిల్వచేసి ప్రాసెస్ చేసేదే ఈ లీనియర్ ఆల్జీబ్రా. జీపీఎస్, డ్రోన్లు, రోబోటిక్స్, గ్రాఫిక్స్, ఏఐలో డేటా ప్రాతినిధ్యానికిది కీలకం.
ఇందులో మరో కీలకమైన ఈజెన్ వ్యాల్యూస్, ఈజెన్ వెక్టర్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేస్తేనే ఫేస్ రికగ్నైజేషన్, గూగుల్ సెర్చ్ అల్గారిథమ్, ఇమేజ్ కంప్రషన్, ఏఐ మోడల్స్‌పై పట్టు దొరుకుతుంది. అయితే, అకడమిక్ అధ్యాపకులు దీన్ని థియరీగానే అందిస్తారు. దీనివల్ల ఏఐపై సరైన పట్టు రావడం లేదు. క్యాంపస్ సెలెక్షన్స్‌లో విద్యార్థులు వెనుకబడి ఉండటానికి లీనియర్ ఆల్జీబ్రాపై పట్టు లేకపోవడమేనని తేలింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ నిపుణుల చేత పార్ట్‌టైం బోధన చేయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఏఐసీటీఈ సూచించింది.
కోర్ గ్రూపులపైనా విజువల్
సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల వారూ ఇప్పుడు ఏఐ పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. భవన నిర్మాణం, యంత్ర పరికరాల తయారీ మొత్తం ఏఐపైనే నడుస్తోంది. ఈ కారణంగా కోర్ గ్రూపులను ఆప్‌డేట్ చేయాలని ఏఐసీటీఈ సూచించింది. కోర్ గ్రూపుల్లో ఏఐ, డేటా మైనింగ్, డేటా విజువలైజేషన్ వంటి సబ్జెక్టులను ప్రవేశ పెడుతున్నారు. మూడో ఏడాది విద్యార్థులకు డీప్ లెర్నింగ్‌పై చాప్టర్లు ఉంటాయి. బిగ్ డేటా అనాలసిస్ చేసేలా అవసరమైన రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ విధానం అవసరమని ఏఐసీటీఈ చెబుతోంది.
జనరేటివ్ ఏఐ, లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ వంటివి నాల్గో సంవత్సరంలో కీలకం చేశారు. అయితే, ప్రతీ కాలేజీలోనూ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, మెషీన్ లెర్నింగ్ లేబొరేటరీ డేటా అనలిటిక్స్ ల్యాబ్, కంప్యూటర్ విజన్ ల్యాబ్, ఏఐ ప్రాజెక్టు ల్యాబ్ ఉండాలని చెబుతోంది. ఇలాంటి మౌలిక వసతులపై ప్రతీ వర్సిటీ దృష్టి పెట్టాలని, ఇవన్నీ ఉన్నప్పుడే అనుబంధ గుర్తింపు ఇవ్వడం మంచిదని అంటోంది.


