సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం.. ఆ తర్వాత నట్టేట ముంచటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య ఘటన ఆవేవన కలిగించిందన్న ఆయన.. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ యువతను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
కానీ, ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లుగా జాబ్‌క్యాలెండర్ ఇవ్వలేదు. తెలంగాణ యువత.. ప్రత్యేకించి నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో వేణు అనే యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వేణు తన లేఖలో రాశాడు. అలాగే బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని కూడా గుర్తు చేశాడు. వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ రాశాడు. బీఆర్‌ఎస్ హయాంలో 2 లక్షల 42 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. హైదరాబాద్‌లో 142 ఫ్లైఓవర్లు నిర్మించిందెవరు? సచివాలయం కట్టించింది ఎవరు? బీఆర్‌ఎస్ హయాంలో చివర 48 వేల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చాం.
రేవంత్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానవతా దృక్ఫతం లేకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు. విద్యార్థుల విలువ సీఎం రేవంత్‌కు ఏం తెలుసు?. అసలు నిరుద్యోగులకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయి. 7 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకిచ్చారు?.
యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చింది. అశోక్ నగర్‌లో సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువ లేదు. ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రాహుల్ పట్టించుకోరా? ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులపై దాడులు జరిగితే వెళ్తున్న ఆయన.. అసలు హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదు?. తెలంగాణ వైపు చూసే దమ్మే ఆయనకు లేదా?
కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటోంది. రాహుల్, రేవంత్ తెలంగాణ యువతను మోసం చేశారు. వాళ్లు ఇద్దరు ప్రకటించిన డిక్లరేషన్లు, కార్డులు క్రిమినల్ వేస్ట్. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడం క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. వేణు సూసైడ్‌కు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫారాలు నింపడం రాదని రేవంత్ అన్నారు. ఆ మాటలకు మేం బాధపడ్డాం. అసలు ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఫారం నింపడం వచ్చా?. ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణాలు తెలుసు.. కాంగ్రెస్‌కు ఎలా సమాధి కట్టాలో తెలుసు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మళ్లీ పక్కా ప్రణాళికతో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా.. ముందు ఆ హామీని నెరవేర్చండి. యువత సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రండి అని కేటీఆర్ రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు.


