ఆందోళన, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించే అద్భుతమైన జపనీస్ తత్వ సూత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రేపటి గురించి ముందుగానే అతిగా ఆలోచించి, భయపడటం మానేసి, ఇప్పుడున్న దానిపై దృష్టి పెట్టాలని ఈ భావన బోధిస్తుంది. జీవితం నిరంతరం పరుగులా సాగుతున్న ప్రస్తుత తరుణంలో, భవిష్యత్తు, బాధ్యతల గురించి విపరీతమైన ఆందోళన చెందడం సాధారణమైపోయింది.
ఇలాంటి సమయంలో ‘అషిత వా అషిత నో కజే గా ఫుకు' (Ashita wa Ashita no Kaze ga Fuku) అనే జపనీస్ సామెత మనకు విలువైన గుణపాఠం నేర్పుతుంది. దీని అర్థం ‘రేపటి గాలి రేపు వీస్తుంది’ అని. అంటే రాబోయే సమస్యల గురించి ముందుగానే భయపడి మానసికంగా కుంగిపోకుండా, ఈరోజు మనం చేయగలిగిన పనులపై మాత్రమే శ్రద్ధ పెట్టాలని ఈ తత్వశాస్త్రం సూచిస్తుంది.
రేపు ఏం జరుగుతుందోనని ముందే ఊహించుకోవడం వల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. ప్రతి విషయాన్ని నియంత్రించలేమని గ్రహించి, భవిష్యత్తుపై నమ్మకం ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఏ ఒక్క రోజులోనో మన జీవితంలోని అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కరించలేమని, చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగడమే సరైన మార్గమని ఈ తత్వశాస్త్రం స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: మనిషి డీఎన్‌ఏలో అజ్ఞాత పూర్వీకుల ఆనవాళ్లు!


