ఆత్మహత్య వ్యక్తిగత వైఫల్యమా? | Guest Column Story Written By Vangavolu Ravi On Student Suicides | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య వ్యక్తిగత వైఫల్యమా?

Jul 4 2026 10:58 AM | Updated on Jul 4 2026 10:58 AM

Guest Column Story Written By Vangavolu Ravi On Student Suicides

ఇన్‌ బాక్స్‌

దేశంలో ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం దాదాపు ఒకే విధమైన చర్చ కొనసాగుతుంది. పరీక్షల్లో విఫలమయ్యాడా? చదువు ఒత్తిడిని తట్టుకోలేకపోయాడా? మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా? అంటే సమస్యను పూర్తిగా వ్యక్తి చుట్టూనే కేంద్రీకరిస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ (ఎన్‌టీఎఫ్‌) మధ్యంతర నివేదిక ఈ దృక్పథాన్ని సవాలు చేస్తోంది. విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత కార ణాల ఫలితంగా చూడటం వాస్తవాన్ని అసంపూర్ణంగా అర్థం చేసుకోవడమే నని ఇది స్పష్టం చేస్తోంది.

ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు 2025లో ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ ఫోర్స్‌(ఎన్‌టీఎఫ్‌) మధ్యంతర నివేదిక విద్యార్థుల ‘ఆత్మహత్యలు అసలు సమస్య కాదు; అవి విద్యార్థి సంక్షో భానికి కనిపించే చివరి సూచన మాత్రమే’ అని పేర్కొంది. ఈ నివేదికలో అత్యంత ఆందోళనకరమైన గణాంకాల్లో ఒకటి, సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు తమను క్యాంపస్‌లో ‘బయటి వ్యక్తులు’గా భావిస్తున్నట్లు వెల్లడైంది. భాషా సమస్యలు, సామాజిక–ఆర్థిక అసమానతలు, కుల/వర్గ వివక్ష ఈ దూరాన్ని మరింత పెంచుతున్నాయి.

మరోవైపు కేవలం 56 శాతం మంది మాత్రమే తమ విద్యాసంస్థ... సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్క రిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ గణాంకాలు విద్యార్థి సంక్షోభం వ్యక్తిగతం మాత్రమే కాక, సంస్థాగత స్వభావం కూడా కలిగి ఉందని సూచిస్తున్నాయి. ఎన్‌టీఎఫ్‌ క్షేత్రస్థాయి అధ్యయనాలు కూడా ఇదే స్పష్టం చేశాయి. అందువల్ల ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం ‘అతను ఎందుకు తట్టుకోలేకపోయాడు?’ అనే ప్రశ్నతో పాటు ‘అతను సంక్షోభంలో ఉన్న ప్పుడు వ్యవస్థ ఏ విధంగా స్పందించింది?’ అనే ప్రశ్నను కూడా పరిశీలించాలి.

ఎన్‌టీఎఫ్‌ ప్రకారం... విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా, విద్యాసంస్థల జవాబుదారీతనం, క్యాంపస్‌ సంస్కృతి, మద్దతు వ్యవస్థల నాణ్యతకు సంబంధించిన అంశంగా కూడా చూడాలి. విద్యార్థి మనసులో ‘నేను ఒంటరిని’ అనే భావన కన్నా ‘ఇక్కడ నాకో మద్దతు ఉంది’ అనే విశ్వాసాన్ని పెంపొందించగలిగితేనే ఈ విషాద ఘటనల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని నిల బెట్టడమే నేటి విద్యావ్యవస్థ మొదటి ధర్మం. – వంగవోలు రవి, ఉపాధ్యాయుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement