హాస్టల్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి | Suspicious death of a hostel student | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

Aug 18 2026 5:33 AM | Updated on Aug 18 2026 5:33 AM

Suspicious death of a hostel student

వసతిగృహంలో అదృశ్యమై.. 

చెరువులో మృతదేహమై తేలిన వైనం 

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ బాలుర వసతి గృహానికి చెందిన 6వ తరగతి విద్యార్థి ముద్దాడ దుర్గాప్రసాద్‌ (11) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విద్యార్థి చనిపోయిన ముందు రోజు నుంచి హాస్టల్‌లో కనిపించడం లేదు, విద్యార్థి బంధువు ఒకరు వచ్చి చెప్పేంత వరకు హాస్టల్‌ వార్డెన్‌కూ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ముందు రోజు వసతి గృహంలో అదృశ్యమైన విద్యార్థి మరుసటి రోజు వసతి గృహానికి ఆనుకుని ఉన్న చెరువులో మృతదేహంగా కనిపించడం గమనార్హం. కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం గ్రామానికి చెందిన ముద్దాడ జయరాం, ఆమె భార్య భవానీ హైదరాబాద్‌లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.

వీరి పెద్ద కుమారుడే దుర్గాప్రసాద్‌. ఆదివారం సాయంత్రం దుర్గాప్రసాద్‌ వసతి గృహం నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం సరియాపల్లి గ్రామానికి చెందిన కూరాకుల దశరథ అనే వ్యక్తి హాస్టల్‌కు వచ్చి తమ గ్రామానికి చెందిన విద్యార్థులతో మాట్లాడాడు. మాటల సందర్భంలో దుర్గా ప్రసాద్‌ గురించి అడగ్గా.. అతడు ఇంటికి వెళ్లాడని తోటి విద్యార్థులు చెప్పారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

కానీ విద్యార్థి కమలనాభపురం, సరియాపల్లిలోని తాతయ్య ఇంటికి కూడా వెళ్లకపోవడంతో అనుమానం వచ్చి తాతయ్య సింహాచలం, అమ్మమ్మ అప్పలమ్మ తదితరులు హాస్టల్‌కు వచ్చి తమ మనవడి కోసం సిబ్బందిని అడిగారు. దీంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులకు విషయం తెలియడంతో వెతుకులాడారు. హాస్టల్‌ సమీపంలో ఉన్న చెరువులో విద్యార్థి చెప్పులు కనిపించడంతో గాలించగా మృతదేహం దొరికింది. ఘటనపై కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement