రెండు బంతులతోనే ఎంపికా? | Parents Dissatisfaction With SGF Under-14 Cricket Selection | Sakshi
Sakshi News home page

రెండు బంతులతోనే ఎంపికా?

Oct 2 2026 1:37 PM | Updated on Oct 2 2026 1:39 PM

Parents Dissatisfaction With SGF Under-14 Cricket Selection

విజయనగరం: జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక విజ్జి స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్‌–14 క్రికెట్‌ ఎంపిక ప్రక్రియపై పలువురు తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి  జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌  ఆధ్వర్యంతో  పాటు మిగిలిన ఫార్మాట్‌లలో జరిగిన ఎంపిక పోటీల్లో ఇదే పద్ధతిని సెలక్షన్‌ కమిటీ సభ్యులు అవలంబిస్తున్నారన్న అపవాదు  కొన్నేళ్లుగా కొనసాగుతోంది. 

విద్యార్థుల క్రికెట్‌ ప్రతిభను సమగ్రంగా అంచనా వేయకుండా, కొంతమంది క్రీడాకారులకు కేవలం రెండు బంతులు వేసే అవకాశం కల్పించి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. క్రికెట్‌లో ఒక విద్యార్థి బౌలింగ్‌ సామర్ధ్యాన్ని అంచనా వేయాలంటే లైన్, లెంగ్త్, వేగంతో  పాటు మ్యాచ్‌ పరిస్థితుల్లో ప్రదర్శనను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా బ్యాటింగ్, ఫీల్డింగ్, వికెట్‌ కీపింగ్, ఆటపై అవగాహన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. 

కేవలం రెండు బంతుల ప్రదర్శన ఆధారంగా ఒక విద్యార్థి ప్రతిభను నిర్ణయించడం ఎంతవరకు సమగ్ర ఎంపిక విధానం? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఒక ఆటగాడికి తగినంత అవకాశం కల్పించి, అందరికీ ఒకే విధమైన ప్రమాణాలతో పరీక్ష నిర్వహిస్తే ఎంపిక ప్రక్రియపై విశ్వసనీయత పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు. జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యే విద్యార్థులు భవిష్యత్తులో డివిజన్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే అవకాశం ఉన్నందున, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాస్త్రీయమైన ప్రమాణాల ఆధారంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశం కల్పించాలి
ఎంపికలో అనుసరిస్తున్న అధికారిక ప్రమాణాలు, ఎంపిక కమిటీ సభ్యుల వివరాలు, ప్రతి క్రీడాకారుడిని అంచనా వేసే విధానం వంటి అంశాలను బహిరంగంగా తెలియజేయాలని వారు కోరుతున్నారు. అలాగే ఎంపికపై అభ్యంతరాలు ఉన్న తల్లిదండ్రులకు తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జిల్లా స్థాయి క్రీడా ఎంపిక ప్రక్రియలో ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశం, స్పష్టమైన ప్రమాణాలు, పారదర్శకత ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement