నికీ ప్రసాద్ (PC: Female Cricket)
ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 281 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది.
టీ20 సిరీస్‌లో పరాభవం
కాగా అనధికారిక సిరీస్‌లలో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఏకైక టెస్టు ఆడేందుకు ఆసీస్ మహిళల జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆసీస్.. అనూహ్య రీతిలో భారత జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
వన్డే సిరీస్ కైవసం
అయితే, వన్డే సిరీస్‌ను మాత్రం భారత మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ధర్మశాల వేదికగా మంగళవారం ఏకైక టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
364 పరుగులు చేసి ఆలౌట్
ఓపెనర్లు శుభా సతీశ్ (59) , ప్రియా పునియా (46) శుభారంభం అందించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ అనుష్క శర్మ (44) కూడా రాణించింది. అయితే, ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన తనీషా సింగ్ (92), నికీ ప్రసాద్ (91) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
కుప్పకూలిన ఆసీస్
ఆసీస్ బౌలర్లలో లిల్లీ మిల్స్ నాలుగు, చార్లి నాట్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. టెస్ ఫ్లింటాఫ్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, ఫ్రాంకీ నిక్లిన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కేవలం 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో కెప్టెన్ రేచల్ ట్రెనామన్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ తామిలా విల్సన్ (35) ఓ మోస్తరుగా రాణించారు.
భారత బౌలర్లలో వైష్ణవి శర్మ ఆరు వికెట్లతో చెలరేగి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. మిగిలిన వారిలో శుచి ఉపాధ్యాయ్, నికీ ప్రసాద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగుల ఆధిక్యం లభించింది.
భారీ లక్ష్యం
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 257 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ ప్రియా పునియా అర్ధ శతకం (59) బాదగా.. యస్తికా భాటియా 46, అనుష్మ శర్మ 48 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్ లిల్లీ మిల్స్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ఫ్రాంకీ నిక్లిన్ నాలుగు, చార్లీ నాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
281 పరుగుల తేడాతో జయభేరి
ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ ఆసీస్‌కు 446 పరుగుల మేర భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో కంగారూ జట్టు 164 పరుగులకే కుప్పకూలడంతో.. గురువారం నాటి ఆట సందర్భంగా భారత్ 281 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
నికీ ప్రసాద్ ఐదు వికెట్లతో చెలరేగగా.. వైష్ణవి శర్మ మూడు, శుచి ఉపాధ్యాయ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న 20 ఏళ్ల నికీ ప్రసాద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


