PC: BCCI/X
టీమిండియా పేసర్ ఆకిబ్ నబీ తన అంతర్జాతీయ అరంగేట్రంలో తీవ్ర నిరాశపరిచాడు. వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన నబీ.. గల్లీ బౌలర్ కంటే దారుణంగా విఫలమయ్యాడు. ఈ జమ్మూ స్పీడ్ స్టార్ 8.5 ఓవర్లలో 9.5 ఎకానమీతో ఏకంగా 84 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఈనేపథ్యంలో నబీపై భారత వెటరన్ క్రికెటర్ హనుమ విహారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నబీ వన్డేలు, టీ20లకు కాకుండా టెస్టు క్రికెట్‌కే సెట్ అవుతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా రెడ్ బాల్ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న 29 ఏళ్ల నబీకి వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం అంత మంచి రికార్డు లేదు.
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ఛాంపియన్‌గా జమ్మూ అండ్ కాశ్మీర్ నిలవడంలో నబీది కీలక పాత్ర. కానీ ఆ తర్వాత జరిగిన పరిమిత ఓవర్ల దేశవాళీ టోర్నీల్లో అతడు రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే వైట్‌బాల్ ఫార్మాట్ అతడికి సరిపోదని విహారీ అన్నాడు.
"ఆకిబ్ నబీ మైదానంలో కాస్త తడబడుతున్నట్లు కనిపించాడు. అతడి వద్ద అధిక పేస్ లేదు. ఎక్కువగా స్వింగ్‌పైనే ఆధారపడతాడు. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో అంత స్వింగ్ లభించదు. అతడిని తప్పుడు ఫార్మాట్‌లో ఆడిస్తున్నారు. నబీకి టెస్ట్ క్రికెట్‌లో అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే అతడి అసలు సత్తా ఏంటో తెలుస్తుంది.
వన్డేలు, టీ20లు అతడికి సెట్ కాడు. రెడ్-బాల్ క్రికెట్టే అతడికి సరిగ్గా సరిపోతుంది" అని విహారి తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా గౌహతి వన్డేలో నబీ ఒక్కడే కాదు గుర్నూర్ బ్రార్ దారుణంగా విఫలమయ్యాడు. తన పది ఓవర్ల కోటాలో ఏకంగా 96 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అరంగేట్రంలో నబీ నిరాశపరిచినప్పటికి టీమ్ మేనెజ్‌మెంట్ మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా క్రికెట్ సంచలన నిర్ణయం.. 10 ఏళ్ల తర్వాత అతడికి పిలుపు


