సేవయే సాధనగా: గాంధీజీ ఆధ్యాత్మిక ప్రయాణం | Devotion: Mahatma Gandhijis spiritual way of life | Sakshi
Sakshi News home page

సత్యమే దేవుడు: మహాత్ముని అంతరంగ తరంగాలు

Oct 2 2026 6:45 AM | Updated on Oct 2 2026 7:17 AM

Devotion: Mahatma Gandhijis spiritual way of life

మహాత్మా గాంధీ ఆధ్యాత్మికత ఆయన రాజకీయ, సామాజిక జీవితానికి పునాది. గాంధీజీకి ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, వ్రతాలు లేదా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయడం కాదు; సమాజ సేవ, సత్య సాధన, మానవత్వమే ఆయనకు అసలైన ఆధ్యాత్మిక మార్గాలు. గాంధీజీ ఆధ్యాత్మిక జీవన విధానంలోని ముఖ్యమైన అంశాలు కొన్ని ...

ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి జీవన విధానంలో అనుసరించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకుందాం. 

సత్యమే దేవుడు 
గాంధీజీ తన జీవితాంతం సత్యాన్వేషణకే అంకితం చేశారు. ప్రారంభంలో ఆయన ‘దేవుడే సత్యం‘ అనేవారు, కానీ కాలక్రమేణా అనుభవంతో ‘సత్యమే దేవుడు‘ అని ప్రకటించారు. సత్యం అనేది ఒక రూపం లేని శక్తని, అది అందరి అంతరాత్మలో ఉంటుందని ఆయన నమ్మారు.

అహింస
ఆయనకు అహింస అనేది కేవలం ఒక రాజకీయ ఆయుధం కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఎవరినీ మానసికంగా గాయపరచకుండా ఉండటమే అహింస. శత్రువును కూడా ప్రేమతో, ఓర్పుతో గెలవవచ్చని ఆయన నిరూపించారు. అహింస ద్వారానే సత్యాన్ని సాధించగలమని ఆయన నమ్మకం.

భగవద్గీత ప్రభావం
గాంధీజీ భగవద్గీతను తన ‘ఆధ్యాత్మిక నిఘంటువు‘గా... ‘తల్లి‘ గా భావించేవారు. గీతలోని ‘నిష్కామ కర్మ‘ (ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం) ఆయనను బాగా ప్రభావితం చేసింది. కష్ట సమయాల్లో గీతోపదేశం తనకు మానసిక శాంతిని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చిందని ఆయన స్వయంగా చెప్పుకున్నారు.

అంతఃకరణ శుద్ధి, ప్రార్థన
గాంధీజీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సామూహిక ప్రార్థనలు చేసేవారు.అన్ని మతాల పవిత్ర గ్రంథాలలోని శ్లోకాలను, ప్రార్థనలను ఆయన తన ప్రార్థనా సమావేశాలలో చేర్చారు. ‘రఘుపతి రాఘవ రాజారామ్‌‘ ర్థన ఆయనకు ఎంతో ప్రియమైనది. మనసును శుద్ధి చేసుకోవడానికి ఆయన తరచూ మౌన వ్రతం, ఉపవాసాలు చేసేవారు.

సర్వధర్మ సమభావం
గాంధీజీ హిందూ మతంలో జన్మించినప్పటికీ, అన్ని మతాలను సమానంగా గౌరవించారు. క్రై స్తవ మతంలోని ’కొండమీద ప్రసంగం’ ఇస్లాం, జైన, బౌద్ధ మతాలలోని మంచి బోధనలను ఆయన స్వీకరించారు. మతాలన్నీ వేర్వేరు మార్గాల ద్వారా ఒకే దేవుడి వైపు నడిపిస్తాయని ఆయన విశ్వసించారు.

మానవ సేవే మాధవ సేవ
సమాజంలో వెనుకబడిన, అణగారిన వర్గాల (హరిజనుల) సేవ చేయడమే దేవుడిని చేరుకోవడానికి మార్గమని గాంధీజీ నమ్మారు. మానవాళికి సేవ చేయకుండా దేవుడిని కనుగొనలేమని ఆయన స్పష్టం చేశారు.

మహాత్మా గాంధీ ఆధ్యాత్మికత జీవితానికి దూరంగా ఉండేది కాదు; అది దైనందిన జీవితంలో, రాజకీయాల్లో నైతికతను, సత్యాన్ని, ప్రేమను ఆచరించేలా ఉండేది. గాంధీ జయంతి నాడు ఆయన పటానికి దండ వేయడమే కాదు. ఆయన చెప్పిన మంచిని ఆచరించడం... ఆయన బోధలను అనుసరించడం కూడా!  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement