మహాత్మా గాంధీ జీవితంతో... | Actor Manoj Bajpayee will essay the role of Mohandas Karamchand Gandhi | Sakshi
Sakshi News home page

మహాత్మా గాంధీ జీవితంతో...

Oct 2 2026 12:18 AM | Updated on Oct 2 2026 12:20 AM

Actor Manoj Bajpayee will essay the role of Mohandas Karamchand Gandhi

మనోజ్‌ బాజ్‌పేయి, ప్రతీక్‌ గాంధీ

స్వాతంత్య్ర సమరయోధులు, జాతి పిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా మరికొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాలు, సిరీస్‌ల గురించి తెలుసుకుందాం.

గాంధీ అండ్‌ మై మదర్‌ ... మహాత్మ గాంధీ జీవితంలోని ఓ కీలక అధ్యాయంతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు సుధీర్‌ మిశ్రా తెలిపారు. ఒకవైపు దేశ స్వాతంత్య్ర సంబరాలకు సిద్ధం అవుతుంటే, ఢిల్లీ అధికారిక కేంద్రంగా మారుతున్న తరుణంలో గాంధీజీ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ఏంటి? ఆ సమయంలో ఆయన జీవితంలో 21 రోజుల పాటు ఏం జరిగింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని సుధీర్‌ మిశ్రా పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతానికి ‘గాంధీ అండ్‌ మై మదర్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో గాంధీజీ పాత్రలో మనోజ్‌ బాజ్‌పేయి నటిస్తున్నారు. సౌరభ్‌ శుక్లా ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. అనుభవ్‌ సిన్హా, నరేంద్ర హిరావత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

గాంధీ... గాంధీజీ జీవితం ఆధారంగా దర్శకుడు హన్సల్‌ మెహతా తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘గాంధీ’. ఈ సిరీస్‌లో గాంధీజీ పాత్రలో ప్రతీక్‌ గాంధీ నటిస్తున్నారు. మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ అనే ఒక సాధారణ యువకుడి స్థాయి నుంచి మహాత్మా గాంధీగా ఎలా మారారు? అనే ప్రయాణం నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది.  2025లో జరిగిన 50వ టోరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని ప్రదర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్‌ ఇండియా’, ‘గాంధీ: ది ఇయర్స్‌ దట్‌ చేంజ్డ్‌ ది వరల్డ్‌’ పుస్తకాల ఆధారంగా ఈ సిరీస్‌ను మల్టీ–సీజన్‌ డ్రామాగా అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ అందించనుంది. ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఫౌజీలో...?  వెండితెరపై మరోసారి మహాత్మా గాంధీ పాత్రలో కనిపించనున్నారట అనుపమ్‌ ఖేర్‌. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’ చిత్రంలో మహాత్మా గాంధీగా అనుపమ్‌ ఖేర్‌ నటించారు. కాగా, ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫౌజీ’లోనూ గాంధీ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్‌గా, మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, జయప్రద, భాను చందర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. 
ఇలా గాంధీజీ జీవితం నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement