ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. మూడు పాని చిత్రంలోని పాట వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ సినిమాలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ వివాదంలో ఇళయరాజా చేసిన అప్పీల్‌ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
సినిమా పాటల్లో కేవలం ట్యూన్‌పై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని సుప్రీ స్పష్టం చేసింది. సాహిత్యం, సౌండ్ రికార్డింగ్ కాపీరైట్ హక్కులు ఆయనకు చెందవని తెలిపింది. నిర్మాత నుంచి హక్కులు పొందిన ‘సరిగమ’ మ్యూజిక్ లేబుల్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
కాగా.. అఘతియా చిత్రంలో రీక్రియేటెడ్ వర్షన్ లైసెన్స్ వివాదంపై ఇళయరాజా పిటిషన్ దాఖలు చేశారు. 1980లో విడుదలైన ‘మూడు పాని’ సినిమాలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటను గతేడాది విడుదలైన ‘అఘతియా’ చిత్రంలో రీక్రియేట్ చేశారు. అయితే తన అనుమతి లేకుండా తన పాట రీక్రియేట్ చేయడంపై ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. మరోవైపు తమ సంస్థ కాపీరైట్ పొందిన సినిమాల పాటలకు ఇళయరాజా హక్కు కోరుతున్నారని.. వాటిని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నట్లు సరిగమ కూడా కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు గతంలో విచారణ జరిపి స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు చుక్కెదురైంది.


