‘‘సూర్యుడుండగానే వడియాలు ఎండేస్కో’’! | vadiyalu Humorous story about Personality development | Sakshi
Sakshi News home page

‘‘సూర్యుడుండగానే వడియాలు ఎండేస్కో’’!

Oct 2 2026 4:54 AM | Updated on Oct 2 2026 4:54 AM

vadiyalu Humorous story about Personality development

హ్యూమరమరాలు

లోకంలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పాఠాలు చెప్పే కొందరికి బోల్డంత గిరాకీ అట. గంటకు లక్షల ఫీజు పే చేసి, ఫైవ్‌ స్టార్‌ అకామడేషన్‌ ఇచ్చి మరీ వాళ్ల క్లాసులు వింటార్ట. కానీ...  మా రాంబాబుగాడు ఒకడికి చేసిన ఓ ఉద్బోధ చూసి నాకు తల తిరిగిపోయింది. వాడి లాజిక్కులకు అక్షర లక్షలిచ్చినా సరిపోవనిపించింది. ఆ 
కౌన్సెలింగేదో మీరూ విని తీరాలి. 

‘‘ఏంట్రా బాబూ నువ్వు... ఈ లోకంలో నాకెవ్వరూ లేడు... నాకు తోడెవ్వడూ రాడు... అంటూ బాధపడుతుంటావ్‌. ఈరోజే వడియాలవీ పెట్టినట్టున్నావ్‌. చూశావా... సూర్యుడు 15కోట్ల కి.మీ. దూరం నుంచి రోజూ వస్తున్నాడు.  ఎందుకూ? జస్ట్‌... నీ వడియాలూ అవీ ఆరబెట్టడానికే. ఆమాటకొస్తే వాడు ఆదివారంనాడు కూడా వచ్చి డ్యూటీ చేస్తుంటాడు. లోకంలో అటు పక్క ఉన్న అమెరికా వాళ్లక్కూడా సేవలు చెయ్యడానికి నైడ్డ్యూటీ వేసుకుని వెళ్తాడా? మళ్లీ ఆ నైడ్డ్యూటీ  అయిపోగానే 
‘అరెరె... నిన్నటి వడియాలు పూర్తిగా ఎండాయో లేవో’ అన్న బెంగతో... ఠంచనుగా మర్నాడుదయానికి ఫ్రెష్షుగా వచ్చేస్తాడు. అన్నట్టు... అప్పట్లో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని బ్రిటిష్‌వాళ్లు ఏర్పాటు చేసుకుందెందుకో తెల్సా? వాళ్ల దేశంలో పెద్దగా ఎండా అదీ రాదు కాబట్టి వాళ్లూ వాళ్ల వస్తువులేమైనా ఉంటే వాటినీ ఆరేసుకోడానికే. 

ఇక నువ్వు తలకి రంగేసుకున్న రోజున ఓ మబ్బుకు నీతో సరసమాడాలనిపించింది. అలా సెలూన్లోంచి బయటకు రాగానే... నీ బుర్రమీద పడేలా ఓ చినుకు బెడ్డను తీసుకుని 18,000 ఫీట్ల ఎత్తు మీదినుంచి ఠపేలని విసిరి మబ్బు పరాచికాలాడుతుంది. థపాక్‌ అంటూ ఆ నీటి బెడ్డ నీమీద పడుతుంది. సాక్షాత్తూ క్యుమిలోనింబస్, నింబోస్ట్రాటస్‌ మబ్బులు రంగేసుకున్న నీ నెత్తిమీద నిమ్మకాయ పిండినట్టు వర్షాన్ని పిండుతాయి. ఇలా ప్రకృతి నీతో దొంగాపోలీసాటాడుతూ ఎకసెక్కాలాడుతుంటే... ఇంకా నీకెవ్వరూ లేరనుకుంటున్నావంటే నీ అంత వేస్ట్‌ ఫెలోగాడు ఎవడైనా ఉంటాడట్రా!? 

నువ్వు తెగహడావుడిగా బహు వేగంగా వెళ్తుంటే... ‘అబ్బే అప్పుడే ఏవెళ్తావుగానీ... కాసేపాగి వెళ్లు’  అంటూ రోడ్డు మీద స్పీడు బ్రేకర్‌ కూడా గోముగా బతిమాలుకుంటుంది. మీ పొలంలోని తుమ్మ చెట్టు తన తుమ్మ బంకను నీ బాటమ్‌కు పూసేసి... ‘కాసేపు కూచో’ అంటుంది. ఆఖరికి మీ పెరటి రేగుచెట్టు కంప కూడా నీ చొక్కా పుచ్చుకు ఆపేస్తుంది. 

మీ వీధి కుక్కకు నువ్వెప్పుడైనా జీతం గీతం భత్యం గిత్తెం ఇచ్చావా? అయినా తన డ్యూటీ తాను చేస్తూ... నువ్వు బండి హ్యాండిల్ను మీ వీధికి టర్నింగివ్వగానే ఓసారి ఫ్రెండ్లీగా గుర్రుర్రుమంటుంది. నీ జీవితకాలంలో నువ్వొక్క పైసా విదల్చకపోయినప్పటికీ... ‘తన మెడకు... పండగ నాడు కూడా పాత పట్టీయేనా’ అనుకోకుండా నిన్ను గుర్తుపట్టినట్టుగా ఓ స్నేహమొరుగుడు నవ్వు నవ్వుతుంది. 

‘నీకెప్పుడైనా ఎదుటాడి మీద కోపం వచ్చిందనుకో. నువ్వు తొడగొట్టగానే... తాము దెబ్బలు తింటూ కూడా... తమ ఓనరు తాలూకు పౌరుషాన్నీ, ప్రతాపాన్నీ ప్రదర్శిస్తాయి. ‘ఠపేల్‌ ఠపేల్‌’మంటూ రీసౌండింగు వచ్చేలా మోగుతూ నీ గొప్పదనాన్నీ... నీ పంతాన్నీ పరాక్రమాన్నీ లోకానికి చూపిస్తాయి. తొడకంటే నీ బతుక్కు తోడెవ్వడ్రా?

అన్నట్టొరే... నీ కాలి కింద ఉండే చెప్పుకు ఏం పని చెప్పు? ఎవడో ఊసేసిన చూయింగ్‌ గమ్‌  జిగురును నీకు అంటకుండా తానే అంటించుకుని త్యాగమదీ చేస్తుందా? నువ్వేమో దాన్ని ఏమాత్రం గౌరవించకుండా సదరు చెప్పును ఏ బండకో వేసి బరాబరా బరుకుతావా? ఎక్కడో కొండల్లో ఉండాల్సిన కంకర కాస్తా మీ ఇంటి ఎదురుగా రోడ్డు మీదకొచ్చి నీ కాలికింద ‘కాంక్రీట్‌ తివాచీ‘ గా మారాలా? నువ్వేమో నాకెవ్వడూ లేడూ... నువ్వేమో ‘నా పేరు బికారీ... నా దారి ఎడారీ’ అంటూ పాతపాటలూ... ‘జగమంత సెకండ్‌ ఫ్యామిలీలూ వాళ్లవీ... ఏకాకి జీవితం నాదీ’ అంటూ పేరడీతో కొత్త సాంగ్సూ పాడుకుంటూ సెల్ఫ్‌పిటీల తాలూకు విషాద విజిళ్లు కుమ్ముతుంటావా? నీకెవ్వడూ లేడంటూ దొంగేడుపులు ఏడుస్తుంటావా? ఎహె... ఇగ చాలుగానీ ఆపు’’ అంటూ రాంబాబుగాడో ఓ లెందీ క్లాసు పీకాడు! 

‘అయితే... ఇప్పుడు నన్నేం చేయమంటావ్‌‘ అడిగాడు అవతలి వాడు. దాంతో ఓ అద్భుతమైన మాటతో తన కౌన్సెలింగ్‌ ముగించాడు మా రాంబాబుగాడు. అదేమిటంటే... 
‘దిగులొదిలేసుకుని... ముందుగా నీ దుస్తులూ, దుప్పట్లూ, వడియాలూ గట్రా ఏమైనా ఉంటే అవి ఆరేలా చూస్కో. ఎందుకంటే... ‘సూర్యుడుండగానే వడియాలారబెట్టుకో’ అనే సామెత విన్లేదా నువ్వూ?’’  
 

– యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement