అంకెలే ఆమె మనోబలం | Learning Maths is Key to Innovation, Dr Sujatha Ramdorai special story | Sakshi
Sakshi News home page

అంకెలే ఆమె మనోబలం

Sep 5 2026 4:34 AM | Updated on Sep 5 2026 4:34 AM

Learning Maths is Key to Innovation, Dr Sujatha Ramdorai special story

సెకండ్‌ లైఫ్‌

‘ఉన్నది ఒక్కటే జీవితం’ అనేది సందేహం లేని సత్యం అయితే కావచ్చుగానీ.... ఒకే జీవితంలో రెండు జీవితాలు ఉంటాయి! పరాజయానికి ముందు ఒకటి... విజయం తరువాత ఒకటి... నిరాశలో ఒకటి... నిరాశను జయించిన తరువాత ఒకటి... మన దేశంలోని గణిత మేధావులలో ఒకరైన సుజాత రామ్‌దొరైకి కొన్ని సంవత్సరాల క్రితం మెదడు క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది. 

దట్టంగా కమ్ముకొస్తున్న నిరాశ, నిస్పృహ అనే చీకటిని ఆమె తన మనోబలంతో తరిమికొట్టింది. ఆ మనోబలానికి మూలం...గణితంపై అమితమైన ఆసక్తి. దేశంలోని చాలా స్కూల్స్‌లో గణితంలో సుజాత రామ్‌దొరై చేసిన కృషి గురించి మాత్రమే కాదు... ‘అంతా అయిపోయింది’ అనుకునే సమయంలో కూడా ‘ఇప్పుడే మొదలైంది. సాధించాల్సింది ఎంతో ఉంది’ అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరును వ్యక్తిత్వ వికాస పాఠంలా చెబుతున్నారు...

చాలామందికి గణితం అంటే భయం. బెంగళూరుకు చెందిన సుజాత రామ్‌దొరైకి మాత్రం గణితం అంటే చిన్నప్పటి నుంచి సరదా. వాహనాల నంబర్‌ ప్లేట్‌లపై ఉన్న అంకెలను వేగంగా కూడడం అనేది ఆమెకు చిన్నప్పుడు సరదా. నంబర్‌ ప్లేట్‌లపై ఉన్న అంకెలను కూడడంలో తన సోదరుడితో పోటీ పడేది.

ఈ సరదా అలవాటు కాస్తా గణితంపై సుజాతకు అమిత ఆసక్తి కలిగేలా చేసింది. ఆ ఆసక్తే ఆమెను బెంగళూరులోని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీ నుండి అన్నామలై యూనివర్శిటీ వరకు వెళ్లేలా చేసింది. అక్కడి నుంచి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెండటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) వరకు తీసుకెళ్లింది. అక్కడ పీహెచ్‌డీ పూర్తి చేసింది. గణితంలోని అత్యంత క్లిష్టమైన ఇవాసావా సిద్ధాంతంపై పనిచేయడానికి దారితీసేలా చేసింది. బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీలో పనిచేసేలా చేసింది. అక్కడ ఆమె ్రపొఫెసర్‌గా పనిచేశారు. రీసెర్చ్‌ చైర్‌గా గణితశాస్త్రం పరిశోధనలో తనవంతు పాత్ర పోషించారు.

షాక్‌: 2015... 2015లో రామ్‌దొరైకి మెదడు క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. షాక్‌ నుంచి తేరుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో తనకు తన విజయాలు గుర్తు రాలేదు. ఒకే ఒక సందేహం వచ్చింది. ‘నేను గతంలో మాదిరిగా గణితాన్ని ప్రేమించగలనా? అంతశక్తి, ఓపిక, ఆసక్తి ఉంటాయా?’
ఆ ప్రశ్నకు తానే సమాధానం చెప్పుకుంది. ‘యస్‌. నేను కోలుకోగలను. కోలుకోవాలి’. నిలువెత్తు ఆశాభావం, ఆత్మవిశ్వాసం రామ్‌దొరైని కోలుకునేలా చేసింది. మునుపటిలా గణితాన్ని ప్రేమించేలా చేసింది.

ఆర్ట్‌ఫుల్‌గా... తన అభిరుచి జాబితాలోకి మరో సబ్జెక్ట్‌ వచ్చి చేరింది. అదే... చిత్రలేఖనం. తనను తానూ సృజనాత్మకంగా వ్యక్తీకరించుకునే ఒక మార్గంగా ఆర్ట్‌ కనిపించింది. నిరాశ అనే చీకటి కొట్టుకు పోయింది. ఆమె నడిచే దారిలో వెలుతురు వచ్చి చేరింది. గణితాన్ని పిల్లలకు సులభంగా, ఆసక్తికరంగా చెప్పడానికి చిత్తూరులో ‘రామానుజన్‌ మuЇ’ను ఏర్పాటు చేయడంలో రామ్‌దొరై పాలుపంచుకున్నారు. 

‘నేర్చుకోవడం అనేది భయంతో కాదు ఆసక్తితో మొదలు కావాలి’ అనేది పిల్లలకు ఆమె ఉపదేశించే తారకమంత్రం.

గణితంలో రామ్‌దొరై కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం ఐసిటిపి రామానుజన్‌ బహుమతి అందుకున్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు సుజాత రామ్‌దొరై.

తొలి మహిళ... ‘జ్ఞానం అనేది సామూహిక కృషి’ అంటారు రామ్‌దురై. పరిశోధన నుండి బోధన వరకు, ప్రచార కార్యక్రమాల నుండి అవగాహన కార్యక్రమాల వరకు తాను చేసే ప్రతి పనిలో అది కనిపిస్తుంది. ఆమె గురించి చెప్పుకోవడం అంటే, సంక్లిష్టమైన గణిత సమస్యలను అవలీలగా పరిష్కరించే మే«ధావి గురించి మాత్రమే చెప్పుకోవడం కాదు. ఆసక్తి ఉంటే ఎక్కడి వరకైనా చేరుకుంటామని చెప్పుకోవడం. నిశ్శబ్ద శక్తితో సవాళ్లను అధిగమించే ధైర్యం గురించి మాట్లాడుకోవడం.
 
ఉపాధ్యాయుల గురువు!
గ్రామీణ విద్య, వృత్తి విద్య కోసం జీవితాంతం కృషి చేసిన అధ్యాపకురాలు ఆశాదేవి. గాంధీజీ ప్రతిపాదించిన ప్రాథమిక విద్యా విధానం ‘నై తాలీమ్‌’ వ్యాప్తికి కృషి చేశారు. పుస్తకాల చదువు మాత్రమే కాకుండా, చేతివృత్తులు, శ్రమజీవనం, నైతిక విలువలతో కూడిన విద్యాబోధనను ప్రచారం చేశారు. వార్ధాలోని ఆశ్రమంలో వందలాది మంది ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చి గ్రామాలకు పంపించారు.

ఉపాధ్యాయుడే... దేవుడై!
నేపాల్‌లోని నువాకోట్‌ జిల్లాకు చెందిన పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజేంద్ర దవాడి ఒక స్కూల్‌కు ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. మొన్నటి ఆకస్మిక వరదల విపత్తులో రాజేంద్ర తన సమయస్ఫూర్తితో 1643 మంది పిల్లలను రక్షించారు. వరద ఉధృతి పాఠశాల వైపు దూసుకొస్తోందని రాజేంద్రకు అత్యవసర సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బెల్‌ని మోగించి ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారు పాఠశాల భవనాన్ని ఖాళీ చేసిన 10 నిమిషాల వ్యవధిలోనే పాఠశాల భవన సముదాయం వరద ప్రవాహంలో పూర్తిగా కొట్టుకుపోయింది.

మురికి వాడల్లో అక్షర కాంతులు
చిత్రకళనే ఆయుధంగా చేసుకుని ముంబయి మురికి వాడల్లో పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సామాజిక వేత్త, ఉపాధ్యాయురాలు రూబుల్‌ నాగి. తరగతి గదుల నాలుగు గోడల మధ్య కాకుండా వీధుల్లోనే పాఠశాలలను ఏర్పాటు చేస్తూ లక్షలాది మంది పేద పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement