అభిరుచులే అమితానందం | Evergreen star story Amitabh Bachchan lifestyle | Sakshi
Sakshi News home page

అభిరుచులే అమితానందం

Sep 5 2026 4:27 AM | Updated on Sep 5 2026 4:27 AM

Evergreen star story Amitabh Bachchan lifestyle

‘హి’..స్టోరీ అమితాబ్‌ బచ్చన్‌

ఆయన భారతీయ వెండితెరపై ఏకైక సుదీర్ఘ కాల సూపర్‌ స్టార్‌. ఎన్ని విజయ శిఖరాలను అధిరోహించారో, అన్ని అడ్డంకులనూ అధిగమించారు. ఇంటా బయటా వ్యక్తిగతంగా వృత్తిగతంగా ఈ దిగ్గజ నటుడు ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్నో... అయినా 80 ఏళ్ల వయసులోనూ ఎవర్‌గ్రీన్‌ స్టార్‌గా కొనసాగడం వెనుక... ఆయన అనన్య సామాన్య వ్యక్తిత్వం మాత్రమే కాదు  ఆయనకున్న అనూహ్యమైన అభిరుచులూ శక్తి మేరకు దోహదం చేశాయని చెపొ్పచ్చు. ఐదు దశాబ్దాలకు పైగా నటుడిగా అలరిస్తున్న ఆయనకు సినిమాలతోపాటు అనేక ఆసక్తులు ఉన్నాయి.

వారసత్వం... ఆ కవిత్వం
అమితాబ్‌ తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌  ప్రముఖ హిందీ కవి. ఆ వారసత్వం అమితాబ్‌పై కూడా ప్రభావం చూపింది. కవిత్వాన్ని చదవడం, రాయడం, కవితల్లోని భావాలను ఆస్వాదించడం ఆయనకు ఇష్టం. తన బ్లాగుల్లో కూడా కవితా పంక్తులు, సాహిత్యపరమైన ఆలోచనలు కనిపిస్తుంటాయి. కవిత్వానికి లోతైన అర్థం ఉంటుందని, మంచి కవిత్వం పైకి కనిపించే విషయానికి మించి మరొక భావాన్ని అందిస్తుందని ఆయన అంటారు.

బచ్చన్‌... బ్లాగ్‌...
అమితాబ్‌కు ఉన్న ఆసక్తుల్లో బ్లాగింగ్‌ది ప్రత్యేక స్థానం.  సినిమాలు, షూటింగ్‌ అనుభవాలు, కుటుంబం, అభిమానులు, తన ఆలోచనలు, జీవితంపై తన అభి్రపాయాలు.. ఇలా ఎన్నో విషయాలను ఆయన స్వయంగా కవిత్వీకరిస్తుంటారు.  గత 2008లో బ్లాగింగ్‌ ప్రారంభించిన ఆయనకు అది కేవలం సోషల్‌ మీడియా అలవాటుగా మిగలలేదు. అభిమానులను తన ‘ఎక్స్‌టెండెడ్‌ ఫ్యామిలీ’గా భావించేంతగా ఆ అనుబంధం పెరిగింది. ఒకసారి తన బ్లాగ్‌ సైట్‌ పోయిందని తెలుసుకున్నప్పుడు అది తన జీవితంలోని ఒక భాగాన్ని కోల్పోయినంత బాధ కలిగించిందని కూడా రాశారు. ఆ తర్వాత కూడా ఆయన బ్లాగింగ్‌ను కొనసాగించారు. 2023లో తన  బ్లాగ్‌ ప్రయాణానికి 11 ఏళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

కలం.. బలమైన ఇష్టం..
అమితాబ్‌ బచ్చన్‌  హాబీల్లో అత్యంత ఆసక్తికరమైనది పెన్నుల సేకరణ. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన పెన్నులను సేకరించడం ఆయనకు చాలా ఇష్టం. యుక్త వయసు నాటినుంచే ఉన్న ఈ హాబీ వల్ల ఆయన దగ్గర   కొన్ని వేల సంఖ్యలో పెన్నులు ఉండొచ్చని అంచనా. పెన్ను కనిపిస్తే దాని డిజైన్, తయారీ, ప్రత్యేకతను చెప్పగలిగేంత ఇష్టం ఆయనది. లగ్జరీ రైటింగ్‌ ఇన్‌ స్ట్రుమెంట్‌ బ్రాండ్‌ ‘ మోంట్‌బ్లాంక్‌’ నుంచి ఆయనకు ప్రతి పుట్టినరోజు నాడూ ప్రత్యేకమైన పెన్ను బహుమతిగా అందుకుంటారు.

‘వాచ్‌’కలెక్షన్‌...
పెన్నుల తర్వాత అమితాబ్‌కు అత్యంత ఇష్టమైన కలెక్షన్‌  గడియారాలదే. ఖరీదైన, అరుదైన, ప్రత్యేకమైన డిజైన్లతో కూడిన టైమ్‌పీసులపై ఆయనకు ఆసక్తి ఉంది. ఆయన వాచ్‌ కలెక్షన్‌ లో ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు ఉన్నాయంటారు. గత 2016లో ముంబైలోని ఒక హైఎండ్‌ వాచ్‌ బొతిక్‌ ప్రారంభోత్సవానికి అమితాబ్, జయ బచ్చన్‌ హాజరయ్యారు. ఆ సందర్భంలోనే అమితాబ్‌కు లగ్జరీ వాచ్‌లపై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

తన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కు కూడా ఈ వాచీల కలెక్షన్‌ హాబీ వచ్చిందని చె΄్పాడు. బచ్చన్‌ కుటుంబానికి మరో విచిత్రమైన వాచ్‌ అలవాటు కూడా ఉంది. అమితాబ్, అభిషేక్‌ ఇద్దరూ కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు గడియారాలు ధరించడం కనిపిస్తుంటుంది. దీని వెనుక ఓ కథ ఉంది. అభిషేక్‌ స్విట్జర్లాండ్‌లో బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుతున్న సమయంలో రెండు దేశాల టైమ్‌జోన్లను తెలుసుకోవడానికి రెండు గడియారాలు ధరించే అలవాటు ఏర్పడిందిట. అదే అలవాటు తర్వాత ఆ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన స్టైల్‌గా మారింది.

‘టెక్‌’ స్టార్‌
వయసుతో సంబంధం లేకుండా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా అమితాబ్‌ ముందుంటారు. బ్లాగింగ్, మొబైల్, కంప్యూటర్, సోషల్‌ మీడియా వంటి డిజిటల్‌ మాధ్యమాలను ఆయన చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. బ్లాగింగ్‌ ప్రారంభించిన తొలినాళ్లలోనే మొబైల్‌ ద్వారా బ్లాగ్‌ రాసే సదుపాయాన్ని కూడా ఉపయోగించేవారు. తన అభిమానులతో నేరుగా కనెక్ట్‌ అవ్వడానికి టెక్నాలజీని ఎంతగా ఉపయోగించుకోవచ్చో అమితాబ్‌ యువనటులకు చేసి చూపించారు.

‘హ్యామ్‌’ రేడియో...క్రేజ్‌
అమెచ్యూర్‌ రేడియో లేదా హ్యామ్‌ రేడియోపై కూడా ఆయనకు ఆసక్తి ఉంది. దూర ప్రాంతాల్లోని వ్యక్తులతో రేడియో తరంగాల ద్వారా కమ్యూనికేట్‌ చేసే ఈ అభిరుచి కూడా ఆయన సాంకేతికతపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. అమితాబ్‌కు సంగీతం అన్నా అమితాసక్తి. తనకు నిద్ర పట్టని రాత్రుల గురించి బ్లాగ్‌లో రాసినప్పుడు, మృదువైన శాస్త్రీయ సంగీతం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వెల్లడించారు. సితార్, స్లైడ్‌ గిటార్‌ వంటి వాద్యాలపై వినిపించే ధ్యానాత్మక సంగీతం రాత్రి నిశ్శబ్దంలో తన మనసుకు శాంతినిస్తుందని ఆయన పేర్కొన్నారు. సంగీతాన్ని ఆయన కేవలం వినోదంగా కాకుండా ఆత్మకు ఓదార్పునిచ్చే అనుభూతిగా భావిస్తారు.     
        
– సత్యబాబు, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement