బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-18’ కార్యక్రమంలో అమితాబ్ ఇంటి పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన తండ్రి ప్రముఖ హిందీ కవి హరివంశ్‌రాయ్ బచ్చన్ చిన్నప్పటి నుంచే కుల వ్యవస్థను వ్యతిరేకించేవారని అందుకే కుటుంబ ఇంటిపేరుగా బచ్చన్ ఎంచుకున్నారని తెలిపారు.
పాఠశాల అడ్మిషన్ సమయంలో దరఖాస్తు ఫారంలో కులానికి సంబంధించిన కోలమ్ ఉండేది చెప్పారు. అక్కడ నింపినప్పుడు తన తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ కుల వ్యవస్థను అంగీకరించకుండా మా కులం బచ్చన్ అని నమోదు చేశారని తెలిపారు. అప్పటి నుంచి తమ కుటుంబ ఇంటిపేరుగా బచ్చన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
కాగా, అమితాబ్ బచ్చన్ అసలు పేరు అమితాబ్ శ్రీవాస్తవ. 1942లో అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్(ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో జన్మించారు. ఆయన తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రముఖ కవిగా గుర్తింపు సాధించారు.
ఇక అమితాబ్ సినీ ప్రయాణం ‘సాత్ హిందుస్తానీ’ చిత్రంతో ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్న ఆయన.. ‘జంజీర్’, ‘దీవార్’, వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో అగ్ర నటుడిగా ఎదిగారు. ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు.


