టైటిల్ : అనకాపల్లి
నటీనటులు: విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాథ రావు నక్కిన, ఇంద్రజ, సంగీత క్రిష్, కండ్రేగుల నాయుడు, నందిని రాయ్, మహబూబ్ భాషా, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు
నిర్మాణ సంస్థలు: నక్కిన నరేటివ్స్, భవ్యశ్రీ మూవీ మేకర్స్
నిర్మాత: త్రినాథ రావు నక్కిన
కథ, స్క్రీన్ ప్లే: త్రినాథ రావు నక్కిన
దర్శకత్వం: ఖగేష్ తమ్మినేని
సంగీతం: డేవ్జాండ్
సినిమాటోగ్రాఫర్: కటివరపు వంశీ కృష్ణ
ఎడిటర్: అత్తలూరి శ్రీకృష్ణ
విడుదల తేదీ : అక్టోబర్ 2, 2026
కథ ఏంటంటే..
అనకాపల్లి ప్రాంతంలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) పేరంటేనే భయపడే పరిస్థితి. రౌడీగా తనదైన హవాను కొనసాగిస్తూ ఉంటాడు. అదే సమయంలో డ్రగ్స్ వ్యాపారం చేసే నాయుడు (కాండ్రేగుల నాయుడు)తో బుల్లెట్‌కు తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బుల్లెట్ చుట్టూ తిరిగే ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారుతుంటుంది.
మరోవైపు అదే ప్రాంతంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తుంటాడు సాంబశివరావు (త్రినాథరావు నక్కిన). నిజాయితీకి ప్రాధాన్యమిస్తూ, సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడిపే వ్యక్తి అతడు. అయితే అతని కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్) మాత్రం తండ్రి జీవన విధానంతో సంతృప్తిగా ఉండడు. మిడిల్ క్లాస్ జీవితంపై అసంతృప్తితో ఉండే సూర్య.. బుల్లెట్ హవా, అతడి యాటిట్యూడ్, చుట్టూ ఉండే హీరోయిజం చూసి ఆకర్షితుడవుతాడు. అలా బుల్లెట్ గ్యాంగ్‌లో చేరిన సూర్య.. క్రమంగా అతడికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా, రైట్ హ్యాండ్‌గా మారతాడు. ఇద్దరు కలిసి ఎమ్మెల్యే ( వడ్లమాని శ్రీనివాస్) అనుచరుడు నాయుడిని మర్డర్ చేస్తారు. ఇలా బుల్లెట్టుకు అత్యంత నమ్మకమైన అనుచరుడిగా ఉన్న సూరి ఎదురు తిరుగుతాడు. బుల్లెట్టు ఆధిపత్యాన్ని సవాల్ చేస్తాడు. సూరి అలా ఎందుకు చేశాడు? తొలి చూపులోనే ఇష్టపడ్డ అమృత ( సంధ్య వశిష్ట) తో సూరి ప్రేమాయణం ఎలా సాగింది? బుల్లెట్, సూర్య, అమృత, నాయుడు మధ్య సంబంధాలు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? ఈ కథలో సూర్య తల్లి జయంతి (ఇంద్రజ) పాత్ర ఎలాంటి మలుపు తీసుకొస్తుంది? చివరికి వీరి ప్రయాణం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
రెగ్యులర్ రూరల్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్. అయితే బుల్లెట్ పాత్ర చుట్టూ దర్శకుడు డిజైన్ చేసిన ఎన్విరాన్‌మెంట్, అందులోని క్యారెక్టర్స్ మాత్రం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా సూరి పాత్రను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. లోకల్ గుండాయిజం, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఒకే కథలో మేళవించి ఆసక్తికరంగా చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగుతున్న కథలో కొత్త ట్విస్టులు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను జోడించిన విధానం ఈ సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది.
కథలో చెప్పడానికి కూడా ఎన్నో అంశాలను దర్శకుడు ప్రయత్నించారు. ఓ కుర్రాడు తప్పుదారి పడితే అతని జీవితం ఎలా మారిపోతుంది? కత్తి పట్టిన వాడు చివరికి కత్తిపోటుకే ఎలా బలవుతాడు? పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు పడే వేదన ఎలా ఉంటుంది? ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న తేడా ఏంటి? వంటి అంశాలను ప్రధాన కథలో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. త్రినాథరావు రాసిన కథకు ఖగేష్ తనదైన శైలిలో న్యాయం చేశాడని అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో బుల్లెట్ హంగామా, అతని గ్యాంగ్‌లో సూరి చేరడం, మెల్లిమెల్లిగా ఎదగడం, మరోవైపు హీరోయిన్ ఎంట్రీ, లవ్ ట్రాక్ ఇలా కథ సాదాసీదాగానే సాగుతుంది. కొన్ని చోట్ల సుదీర్ఘమైన సన్నివేశాలతో కథను సాగదీసిన భావన కలుగుతుంది. ‘ఇందులో కొత్తగా ఏముంది?’ అనిపించే సమయంలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ కథపై ఆసక్తిని పెంచుతుంది. ఆ ట్విస్ట్‌ను కొంతమంది ముందే ఊహించే అవకాశం ఉన్నప్పటికీ.. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ఇక కొన్ని ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు తన ప్రతిభను చూపించాడు.
సెకండాఫ్‌లో కథ ప్రధానంగా ఎమోషన్, రివెంజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ భాగంలో రొటీన్ రివెంజ్ డ్రామా కొనసాగినప్పటికీ.. పాత్రల భావోద్వేగాలను ముందుకు తీసుకెళ్లిన తీరు కొంత ఆసక్తిని కలిగిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసిందనుకున్న సమయంలో మరో కీలకమైన బ్లాక్‌ను పెట్టడం, దానికి డివోషనల్ ఎలిమెంట్స్‌ను జోడించి కథను ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. చివరికి ప్రేమకు ఒక నిర్వచనం చెప్పేలా సినిమాను ముగించడంతో కథకు ఎమోషనల్ టచ్ వస్తుంది.
ఎవరెలా చేశారంటే..
విక్రమ్ సహిదేవ్ హీరో సూర్య పాత్రలో అన్ని రకాల భావోద్వేగాలను చక్కగా పండించాడు. ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా విభిన్న కోణాల్లోనూ తనదైన నటనతో మెప్పించాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో ఇంకాస్త పరిణతి చూపించి ఉంటే పాత్ర మరింత బలంగా అనిపించేది. ఇక తారక్ పొన్నప్ప తన నటనతో భయపెట్టేస్తాడు. అతడి బాడీ లాంగ్వేజ్, హావభావాలు పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయి. సంధ్య వశిష్ట కూడా అనకాపల్లి అమ్మాయిలా చాలా సహజంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
ఫస్ట్ హాఫ్‌లో డ్రగ్స్ డాన్ నాయుడు పాత్రలో నిర్మాత కాండ్రేగుల నాయుడు చక్కగా నటించాడు. తండ్రి పాత్రలో త్రినాథరావు, తల్లి పాత్రలో ఇంద్రజ మిడిల్‌క్లాస్ తల్లిదండ్రులకు ప్రతినిధులుగా సహజమైన నటనను కనబరిచారు. రౌడీ గ్యాంగ్, ఎమ్మెల్యే, ఎస్సై, డీఎస్పీ తదితర పాత్రల్లో కనిపించిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపూ మనల్ని కూడా అనకాపల్లి వాతావరణంలోకి తీసుకెళ్లిన అనుభూతి కలుగుతుంది. నేపథ్య సంగీతం , పాటలు సినిమాకి ప్లస్ అయ్యాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి..నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.


