కీర్తీ సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన ప్రాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డోరతీ’. సెప్టెంబర్ 25న తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఓ వర్గం ఈ సినిమాను తీవ్రంగా ఖండిస్తే..మరో వర్గం ప్రశంసలు జల్లు కురిపించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఇప్పుడీ చిత్రాన్ని స్పిరిట్ మీడియా ద్వారా రానా దగ్గుబాటి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ శుక్రవారం(అక్టోబర్ 2) ఈ చిత్రం తెలుగులో విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘డోరతీ’ కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1995లో తమిళనాడులోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. వేరు వేరు సామానిక నేపథ్యాలు ఉన్న సుబ్బు(సనంత్), కార్తి(రిషికాంత్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. సుబ్బ వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. వాళ్ల నాన్న స్థానికంగా ప్రభావం ఉన్న గ్యాంగ్‌స్టర్. ఇద్దరు అన్నలు కూడా రౌడీయిజం, రాజకీయాలే చేస్తుంటారు. సుబ్బు, కార్తీ కూడా ఆ గ్యాంగ్‌లో చేరతారు. అయితే చిన్నప్పుడు పురుష అహంకారం చూపించే సుబ్బు..పెద్దయ్యాక మాత్రం పూర్తిగా మారిపోతాడు. గ్యాంగ్‌స్టర్ ప్యామిలీ సభ్యుడే అయినా.. రక్తం చూసినా వాంతులు చేసుకుంటాడు. హింసకు దూరంగా ఉంటూ..ఇంట్లోకి కొత్తగా వచ్చిన వదిన డోరతీ(కీర్తి సురేశ్)తో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అయితే అనూహ్యంగా డోరతీ కన్నుమూస్తుంది. వదిన చావుకు తన తండ్రి, అన్నదమ్ములే కారణమని సుబ్బు భావిస్తాడు. ఆమె మరణం తర్వాత సుబ్బు ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? ఆ నిర్ణయం వల్ల సుబ్బు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అసలు పెద్దయ్యాక సుబ్బులో వచ్చిన మార్పులు ఏంటి? ప్రాణ స్నేహితుడైన కార్తి.. సుబ్బుని చంపాలని ఎందుకు ప్రయత్నించాడు? చివరకు కార్తి, సుబ్బులు స్నేహం ఎలా ముగిసింది? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
జయాపజయాలను పక్కన పెడితే.. కార్తిక్ సుబ్బరాజు కథల్లో ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన సామాజిక కోణం కనిపిస్తూనే ఉంటుంది. ఎలాంటి కథను ఎంచుకున్నా.. దాంట్లో సామాజిక అసమానతలను, కుల, వర్ణ వివక్షల వంటి అంశాలను తనదైన శైలిలో చర్చించే ప్రయత్నం చేస్తుంటారు. వినోదం వెనుక ఓ బలమైన సామాజిక ప్రశ్నను సంధించడం ఆయన కథల్లో కనిపిస్తుంది. ‘డోరతీ’ కూడా అలాంటి కథే. ఇందులో లింగ వివక్ష గురించి చర్చించాడు. ట్రాన్స్ జెండర్ల పట్ల సమాజం తీరు ఎలా ఉంది? వాళ్లకు ఎదురవుతున్న అవమానాలు ఏంటి? పితృస్వామ్య సమాజం మూలంగా వారు అంతర్గతంగా ఎలాంటి క్షోభను అనుభవిస్తున్నారు?అనేది హృదయాలను హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశాడు.
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అతి సున్నితమైనది. కొంచెం తేడా వచ్చినా.. అంతే సంగతి. కానీ కార్తిక్ సుబ్బరాజు మాత్రం తాను అవేవి పట్టించుకోకుండా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాడు. ఈ విషయంలో ఆయనను మరోసారి అభినందించొచ్చు. అయితే ఈ కథను ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమయ్యేలా.. ఎంటర్‌టైనింగ్‌గా మలచడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. కథనాన్ని ముందుకు, వెనక్కి(నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే) నడిపించడం వల్ల చాలా చోట్ల గందరగోళానికి గురి చేశాడు. అలాగే అసలు పాయింట్ చుట్ట అల్లుకున్న సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. చాలా వరకు కథనం నెమ్మదిగా సాగడంతో ఒకనొక దశలో ఎప్పుడెప్పుడు సినిమా ముగుస్తుందా? అనే ఫీలింగ్ కలుగుతుంది.
సుబ్బు, కార్తి పాత్రల మధ్య స్నేహాన్ని, వారి చిన్ననాటి జీవితాన్ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. చిన్నతనంలో సుబ్బు ప్రవర్తన, అతని కుటుంబ నేపథ్యం, గ్రామంలోని కుల రాజకీయాలు, వివక్ష, హింస వంటి అంశాలను చూపించిన తీరు కథపై ఆసక్తిని పెంచుతుంది. డోరతీ పాత్ర ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. సుబ్బు ఆమెతో అన్ని విషయాలు చెప్పుకోవడం.. అంతలోనే ఆమె చనిపోవడం.. అంతలోనే ఇంకో ట్విస్ట్..ఇలా ఫస్టాప్ ప్రారంభం నెమ్మదిగా సాగినా.. ఇంటర్వెల్ సరికి ఆసక్తిని పెంచేస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం చాలా వరకు ఎమోషనల్‌గానే సాగుతుంది. ట్రాన్స్ జెండర్ల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఆయా సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నా..దర్శకుడు అటువైపు వెళ్లలేదు. పైపైనే చూపిస్తూనే. ఈ కథ ద్వారా ఏం సందేశం ఇవ్వాలో అది ఇచ్చేశారు. ఈ క్రమంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. ముగింపు కూడా అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉండదు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా కథ ఎక్కువగా సుబ్బు, కార్తి పాత్రల చుట్టూనే తిరుగుతుంది. సుబ్బుగా సనంత్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్‌గా మారిన తర్వాత తన హవాభావవాలు, నటన చాలా సహజంగా ఉంటుంది. ఇక కార్తిగా రిషికాంత్ కూడా చక్కగా నటించాడు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కీర్తి సురేశ్ తెరపై కనిపించేది కాసేపే అయినా..గుర్తిండిపోయే పాత్ర చేసింది. మిగిలిన నటీటనలు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధానబలం. పాటలు కూడా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాలా సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


