టైటిల్: 'కళ్యాణం కమనీయం జీవితం'
నటీనటులు: ఖాన్ దురాని, సాహితీ అవంచ , ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులు
నిర్మాతలు: పైలా ప్రసాదరావు, కిషోర్ గుండాల
దర్శకత్వం: రవి లోకిరెడ్డి
సంగీతం: శ్రీమురళి కార్తికేయ
విడుదల: 25, సెప్టెంబర్ 2026
కథేంటంటే..
జెన్ జీ యువతి సునయన ఇద్దరి యువకులతో క్లోజ్‌గా మూవ్ అతుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి? నిజమైన ప్రేమ ఎవరిది? అనేది ఆమెకు అర్థం కాదు. సముద్ర తీరాన కూర్చొని దాని గురించే ఆలోచిస్తుండగా.. ఒక భిక్షగాడు వచ్చి ఓ కథ చెబుతాడు. అది కల్యాణ్–కమనీయ అనే దంపతుల కథ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట జీవితంలోకి రాహుల్ అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడి ప్రతీకారం, గతం, కుట్రల కారణంగా ఆ దాంపత్య జీవితంలో అనూహ్యమైన సమస్యలు మొదలవుతాయి. ఒక అందమైన ప్రేమకథ క్రమంగా అనుమానాలు, బాధలు, మోసాలు, సంఘర్షణలతో నిండిపోతుంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కల్యాణ్–కమనీయ కథకు సునయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? గతంలో జరిగిన సంఘటనలు వర్తమానంలో సునయన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి? రాహుల్ అసలు ఎవరు? అతడి గతం ఏమిటి? చివరకు సునయన తన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నదే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
ప్రేమ, పెళ్లి, అనుమానం, మోసం, ప్రతీకారం... ఈ అంశాల చుట్టూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ ఒక జెన్‌జీ యువతి జీవితంతో ముడిపెట్టి చెప్పే ప్రయత్నమే ‘కళ్యాణం కమనీయం జీవితం’. ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు రవి లోకిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా గతంలో జరిగిన కథను ప్రస్తుత తరానికి చెందిన యువతి జీవితంతో అనుసంధానం చేయడం కథలో ఆసక్తిని పెంచే అంశం. సినిమా కథనంలో ప్రేక్షకుడికి కొన్ని ప్రశ్నలు రేకెత్తించే విధంగా కథను ముందుకు తీసుకెళ్లడం దర్శకుడి ప్రయత్నంగా కనిపిస్తుంది.
సినిమా టైటిల్ తగ్గట్లుగానే ప్రేమ అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదని, దాని వెనుక నమ్మకం, కుటుంబం, గతం, భావోద్వేగాలు ఉంటాయని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు జెన్‌జీ ప్రేమకథ, మరోవైపు కల్యాణ్–కామిని దాంపత్య జీవితంలోని విషాదం, వాటి మధ్య రాహుల్ పాత్ర చుట్టూ నడిచే సస్పెన్స్ సినిమాకు ప్రత్యేకమైన నేపథ్యాన్ని అందిస్తాయి.అయితే కథలోని ట్విస్టులు మరింత బలంగా రాసుకొని, కొన్ని కీలక సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
కల్యాణ్ పాత్రలో ఖాన్ దురాని మెప్పించాడు. ప్రేమ, బాధ, సంఘర్షణ వంటి భావోద్వేగాలను పలికించే సన్నివేశాల్లో అతడి నటన కథకు అనుగుణంగా సాగుతుంది. ప్రత్యేకంగా ప్రేమలో ఉన్న వ్యక్తిగా, అలాగే సంబంధాల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనే వ్యక్తిగా పాత్రలోని ఎమోషన్‌ను చూపించే ప్రయత్నం చేశారు. అయితే కథలోని కీలక మలుపులు హీరో పాత్రను మరింత బలంగా ఎలివేట్ చేసి ఉంటే అతడి పాత్రకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. సాహితి అవంచ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంది.
ముఖ్యంగా ప్రేమ, కుటుంబం, భావోద్వేగాల మధ్య సతమతమయ్యే పాత్రలో ఆమె కనిపిస్తుంది. సహజమైన నటనతో పాత్రకు సరిపోయేలా కనిపించారు. హీరోతో కెమిస్ట్రీ కూడా కథకు అవసరమైన స్థాయిలో ఉంటుంది. జెన్‌జీ యువతి సునయన పాత్రలో నటించిన నటితో పాటు సత్యానంద్ లంక, కాకినాడ నాని, సోనీ రెడ్డి, ధనలక్ష్మి బల్ల తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శ్రీమురళి కార్తికేయ సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. సినిమాట్రోగఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.


