నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఏకంగా రూ.88 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓ జాతి మనుగడ కోసం చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
తాజాగా ఈ మూవీ నటించిన టాలీవుడ్ నటుడు రెమో రహీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సీన్లను ఎడిటింగ్‌లో తీసేశారంటూ మనోవేదనకు గురయ్యారు. నేను చేసిన సీన్ దాదాపు ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉందని తెలిపారు. కానీ రన్‌టైమ్ నిడివి కారణంగా.. తాను చేసిన ఓ చిన్న క్లిప్ మాత్రమే ఉంచారని ఆవేదన చెందారు. తాను ఎంతో కష్టపడి చేసిన సీన్స్ తొలగించడం తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రెమో రహీమ్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'సినిమాల్లో నటించడం వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో ప్రాణం పెట్టి చేసిన సీన్లు ఎడిటింగ్‌లో కట్ అయినప్పుడు ఆ బాధ, నిరాశ వర్ణనాతీతం. ఒక నటుడిగా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం నిజంగా చాలా మానసిక వేదనను కలిగిస్తుంది. నేను చాలా బాధపడుతున్నా. నా ట్రక్ సీన్ వాస్తవానికి 5 నుంచి 7 నిమిషాల నిడివి ఉంటుంది. కానీ సినిమా నిడివి కారణంగా కుదించాల్సి వచ్చింది' అని రాసుకొచ్చారు.


