గ్రానైట్‌ బారన్‌, వీరమణి బాగోతం : మీడియా చేతికి షాకింగ్‌ వీడియోలు | Granite Baron R Veeramani child abuse shocking video | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ బారన్‌, వీరమణి బాగోతం : మీడియా చేతికి షాకింగ్‌ వీడియోలు

Sep 24 2026 5:17 PM | Updated on Sep 24 2026 5:31 PM

Granite Baron R Veeramani child abuse shocking video

తమిళనాడుకు చెందిన 84 ఏళ్ల ప్రముఖ గ్రానైట్ బారన్, 'జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్' చైర్మన్ ఆర్. వీరమణిపై నమోదైన బాలికల లైంగిక వేధింపుల (చైల్డ్ సెక్సువల్ అబ్యూస్) కేసుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు 'ఎప్‌స్టీన్'గా అభివర్ణిస్తున్న వీరమణికి సంబంధించి 'ఇండియా టుడే టీవీ' కీలక వీడియోను ప్రత్యేకంగా సేకరించింది. ఇందులో దిగ్భ్రాంతికరమైన దృశ్యాలలో వీరమణి ఒక బాలికతో కనిపిస్తుండగా, మరొక దృశ్యంలో ఆయన మంచంపై అభ్యంతరకర స్థితిలో కనిపిస్తుండటం కలకలం రేపుతోంది. దీంతో వీరమణిపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

కేసు నేపథ్యం
మైనర్లపై లైంగిక దాడికి పాల్పడుతున్న దృశ్యాలున్న పెన్ డ్రైవ్‌ను 2025 అక్టోబర్‌లో ఒక ఎన్జీవో ద్వారా చెన్నై పోలీసులకు అందించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే సరైన ఆధారాలు లేవంటూ పోలీసులు మొదట్లో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయగా, ప్రత్యేక పోక్సో కోర్టు దాన్ని తిరస్కరించి తిరిగి దర్యాప్తునకు ఆదేశించింది.

బాలిక ఆచూకీ దొరకలేదంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఈ కేసు తదుపరి చర్యలు నిలిపివేసిన  ఏడు నెలల తర్వాత ఆ బాలిక ఆచూకీ దొరికింది.  జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన వాంగ్మూలంలో వీడియోలో ఉన్నది తానేనని, అలాగే వీరమణిని కూడా గుర్తించింది. పోలీసులు ఇతర బాధితులను కూడా గుర్తించారు. మాజీ ఉద్యోగి  గణేసన్ ఫోన్‌లో వేరొక వీడియో దొరికినట్లు ఆరోపణలు రావడంతో అతడిని అరెస్టు చేశారు. దానిని రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల కొత్త దర్యాప్తులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన, అప్పట్లో మైనర్లుగా ఉన్న 7 మందికి పైగా బాధితులను గుర్తించారు. చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఒక అద్దె ఇంటిని వేధింపుల కోసం ఉపయోగించినట్లు తేలింది. వీరమణికి సహాయకులుగా ఉన్న శాంతి, మహేంద్ర సింహన్ అనే వ్యక్తులు 12 నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సీఎం విజయ్‌ సీరియస్‌ 
ఈ కేసుకు సంబంధించి ఈ ఆగస్టు 29న వీరమణిని, అతని సహాయకులు శాంతి, మహేంద్ర సింహన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే గతంలో దర్యాప్తు సరిగా చేయని, కేసును నీరుగారార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై కొందరు సీనియర్ పోలీసు అధికారులకు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. ఎలాంటి లోపాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: స్లీపర్‌ బస్సు విషాదం : షాకింగ్‌ విషయాలు వెలుగులోకి 

వీరమణిపై చర్యలు తీసుకోవాలని  గొంతెత్తిన ప్రతిపక్షాలు 
మరోవైపు వీరమణికి సంబంధించిన లైంగిక వేధింపుల కేసులో ప్రమేయమున్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా అందరూ డిమాండ్ చేశారు.  సమగ్ర దర్యాప్తు జరిపి, త్వరితగతిన న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నేరాలకు సహకరించిన వారిని, లేదా వాటి గురించి తెలిసి కూడా చర్యలు తీసుకోని వారిని గుర్తించి, విచారించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ ప్రభుత్వాన్ని కోరారు. స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న వీడియో సంబంధిత సామాగ్రితో సహా అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను సేకరించి, కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు.

ఫిర్యాదులపై చర్యలు తీసుకోని వారు, లేదా కేసును అణచివేయడానికి ప్రయత్నించిన వారందరినీ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్  డిమాండ్‌ చేశారు. పోక్సో ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను ప్రస్తావిస్తూ, దర్యాప్తును వేగవంతం చేయాలని, విచారణలో వెలుగులోకి వస్తున్న ఆధారాల ఆధారంగా తగిన నిబంధనలను అమలు చేయాలని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: జీవిత ఖైదు : కాంబోడియా ప్రియురాలితో గ్యాంగ్‌స్టర్‌ పెళ్లికి పెరోల్‌

సామాజిక హోదా ముసుగులో ప్రజలు ఎంతటి నీచానికైనా దిగజారగలరని ఈ కేసు చూపిస్తోందని మక్కల్ నీది మైయం నాయకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ అన్నారు. ఆరోపణలను వెలుగులోకి తెచ్చిన వారిని ఆయన అభినందిస్తూ, ఈ నేరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన న్యాయ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వీరమణిని, ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని గుర్తించి అరెస్టు చేయాలని, వేగవంతమైన దర్యాప్తు, విచారణ జరపాలని ఎన్‌టికె ముఖ్య సమన్వయకర్త సీమాన్ డిమాండ్ చేశారు. చట్టప్రకారం నిర్దేశించిన గరిష్ట శిక్ష విధించాలని కూడా  కోరారు.

ఇదీ చదవండి: రూ. లక్ష కోట్లు,10 వేల ఉద్యోగాలు : బెంగాల్‌లో అదానీ భారీ పెట్టుబడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement