ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా మళ్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడతామంటూ తేల్చి చెప్పారు. భారత ఎన్నికల సంఘం (ECI)లో అంతర్గత విభేదాల నేపథ్యంలో సీజేపీ మూడు డిమాండ్లు పెట్టింది.
భారత ఎన్నికల కమిషన్.. వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో అభిజీత్ దీప్కే ఎక్స్‌లో ‘జ్ఞానేశ్, ఇక అయిపోయింది బ్రో!’ అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ(గురువారం) మీడియా సమావేశంలో సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.. ఈసీ ముందు డిమాండ్లు పెట్టారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. జరగబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికలనూ నిలిపివేయాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను నిలిపివేసి.. ఓటర్ల జాబితాలను జనవరి 2025 నాటి జాబితాకు తిరిగి మార్చాలి. ‘సర్’కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను పరిశీలించేందుకు స్వతంత్ర విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

యువత తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాలంటూ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. దేశం కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. సీఈసీపై అభిజీత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ ఈ దేశంలోనే అతిపెద్ద దేశద్రోహి. ఆయన వెంటనే రాజీనామా చేయాలి.. ఎందుకంటే ఆయన భారతదేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించారు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం.. కానీ జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినప్పటి నుండి ఎవరు ఓటు వేయాలి? ఎవరు వేయకూడదు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. ఇదేనా ప్రజాస్వామ్యం?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఈసీలో అంతర్గత విభేదాలు


