సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (ఫైల్)
‘సర్’ప్రక్రియ విధానాన్ని వ్యతిరేకించిన ఇద్దరు కమిషనర్లు
14సార్లు అభ్యంతరం వ్యక్తం చేసిన కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తీరుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు
భిన్నాభిప్రాయాలు సహజమే: ఈసీఐ
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ పెను వివాదంలో చిక్కుకుంది. ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. గత పది నెలల కాలంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్‌జోషీలు మొత్తం 14 సార్లు వివిధ నిర్ణయాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తం చేశారని, అనధికారిక, అక్రమ ఉత్తర్వులంటూ తెలిపినప్పటికీ ఆ నిర్ణయాలు అమలయ్యాయని ఈ కథనం ఆరోపించింది.
దీంతో సర్‌తోపాటు ఎన్నికల కమిషన్ తీరుతెన్నులపై ఇప్పటికే పలుమార్లు విమర్శలు, ఆరోపణలు గుప్పించిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మరోసారి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉండే అర్హత ఆయనకు లేదని, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడగా, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ(ఎం), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, పీడీపీలు కూడా గొంతుకలిపాయి.
అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంపై ఒక ప్రకటన జారీ చేస్తూ అన్ని నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా తీసుకున్నవేనని, భిన్నాభిప్రాయాలు సహజమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘంపై, జ్ఞానేశ్ కుమార్‌పై తాము ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నా కేంద్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
కలిసికట్టుగా ఓట్ చోరీ చేసిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఎన్నికల కమిషన్‌లు దేశద్రోహానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌పై వ్యాఖ్యానిస్తూ.. ఏళ్లుగా తాము లేవనెత్తిన అనుమానం ఇప్పుడు నిజమైందని అన్నారు. సీఈసీ తొలగింపు కోరుతూ ఏప్రిల్ 26న 73 మంది రాజ్యసభ సభ్యులు సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారని, వర్షాకాల సమావేశాలింకా ప్రోరోగ్ కాలేదు కాబట్టి.. రాజ్యసభ ఛైర్మన్ ఈ నోటీసుపై ఇప్పుడైనా చర్య తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
పాత జాబితాతో మళ్లీ ఎన్నికలు: మమత
ఎన్నికల కమిషన్‌లో అక్రమ నిర్ణయాలు అమలవుతున్నాయన్న కథనాలపై ప.బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం విమర్శలు చేశారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికలను బీజేపీ, ఈసీలు కలిసికట్టుగా చోరీ చేశాయని, వాటిని రద్దు చేసి సర్‌కు ముందునాటి ఓటర్ల జాబితాతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లో డిమాండ్ చేశారు.
జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి: కేజ్రీవాల్
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేసి, విచారణ జరిపించాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న విషయం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ద్వారా స్పష్టమైందని, మూడేళ్ల నాటి ఓటర్ల జాబితాలను పునరుద్ధరించాలని, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
భిన్నాభిప్రాయాలు సాధారణమే: ఈసీఐ
ఎన్నికల సంఘంలో (ఈసీఐ) కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు, అంతర్గత నోట్స్, సూచనలు ఉండటం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, చట్టబద్ధ నిబంధనలు, సంస్థాగత సంప్రదాయాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం పని చేస్తుందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
పారదర్శకత, చట్టపరమైన నిబంధనల అమలు, పరిపాలనా క్రమశిక్షణను నిర్ధారించేందుకు లిఖితపూర్వక నోట్స్, అభిప్రాయాలు, సాంకేతిక సూచనలు, అంతర్గత తనిఖీలు నిరంతరం కొనసాగుతుంటాయని వెల్లడించింది. ఎన్నికల సంఘం తీసుకున్న అన్ని చర్యలు చట్టాలు, కమిషన్ ఆదేశాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.
గత పది నెలల్లో నమోదైన కొన్ని అంతర్గత నోట్స్, అభిప్రాయాల ఆధారంగా మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ, ఎస్‌ఐఆర్ సహా గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవ నిర్ణయాలేనని స్పష్టం చేసింది. ఈసీఐనెట్‌లో అనధికారిక మార్పులు, డేటా తారుమారు, ఇతర జోక్యాలను నిరోధించేందుకు భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్లు (ఈఆర్‌ఓలు), జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు) తమకు చట్టం కల్పించిన అధికారాల మేరకు ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలను నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది.
ఇద్దరు కమిషనర్లు చేసిన ఆరోపణలు
1. అక్టోబర్ 28, 2025: తగిన అనుమతుల్లేకుండానే ఎన్నికల కమిషన్ పేరుతో లేఖలు, ఆదేశాలు జారీ అయ్యాయని సంధూ అభ్యంతరం.
2. ఏప్రిల్ 16, 2026: ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన కొత్త ఐటీ మాడ్యూళ్లు/పోర్టల్స్ వివరాలు మీడియా ద్వారా తెలుసుకున్నానన్న సంధు.
3. ఏప్రిల్ 16, 2026: కమిషన్ అనుమతి లేకుండానే అధికారిక సమాచాం జారీ
4. ఏప్రిల్ 16, 2026: కమిషన్ సమావేశాలకు సంబంధించిన అజెండా ఏడాదిగా ఇవ్వడం లేదని, మినిట్స్ నమోదు చేయడం లేదన్న జోషీ
5. ఏప్రిల్ 16, 2026: కమిషన్ అధికారులు అనుమతుల్లేకుండానే విదేశీ పర్యటలు
6. ఏప్రిల్ 24, 2026: అనుమతి లేకుండా సమాచారాన్ని జారీ చేయవద్దన్న జోషీ
7. మే 16, 2026: ఫారం–6లో మార్పులు చేయరాదని జోషీ. తర్వాత ఏకీభవించిన సంధూ
8. మే 29, 2026: ఓటర్ల జాబితా సమాచారాన్ని కేంద్రీకృతం చేస్తున్నారన్న జోషీ
9. జూలై 29, 2026: విధుల విభజనలో మార్పులు చేశారని కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు
10. జూలై 29, 2026: విధుల కేటాయింపుపై ఉన్న అభ్యంతరాలను మరోసారి ప్రస్తావిస్తూ, సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని సంధు కూడా కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు.
11. జూలై 30, 2026: కొత్త విధుల కేటాయింపు ఉత్తర్వును జోషి, సంధులు ఇద్దరూ రద్దు చేశారు.
12. ఆగస్టు 12, 2026: బెంగాల్‌లో ఓట్లపై ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో ఎన్నికల కమిషన్ తరఫున అప్పీళ్లు దాఖలు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని సంధూ ప్రశ్నించారు.
13. ఆగస్టు 13, 2026: ఫారం–6లో చేసిన మార్పు చట్టవిరుద్ధమని ప్రకటించిన సంధూ
14. ఆగస్టు 14, 2026: ఈఆర్‌ఓలకు ఈసీఐ నెట్‌ను యాక్సెస్ చేసే అవకాశం లేకపోవడంపై అభ్యంతరం


