న్యూఢిల్లీ: దశాబ్దాలుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 125 ఏళ్ల తాతకు సైతం ఎన్నికల అధికారులు ఎస్‌ఐఆర్ నోటీస్ అందజేశారు. ఢిల్లీలోని సదర్‌బజార్ శాసనçసభ నియోజకవర్గం పరిధిలో 125 ఏళ్ల శ్యామ్ ముఖీజియాకు ఓటు ఉంది. పాత ఢిల్లీ పరిధిలో ఇతనే అత్యంత వృద్ధ ఓటరుగా గుర్తింపు పొందారు. అయినాసరే నీ పేరులో తప్పులు ఉన్నాయని, సంబంధిత నిర్ధారణ పత్రాలు లేదా డాక్యుమెంట్లు చూపించాలంటూ ఈయనకు తాజాగా ఈసీ అధికారులు ఎస్‌ఐఆర్ నోటీస్ పంపించారు.
ఇంకొంత మంది ప్రముఖులకూ నోటీస్‌లు
మాజీ ఆర్‌బీఐ గవర్నర్ బిమల్ జలాన్, భారత వాయుసేన మాజీ చీఫ్ ఎన్‌ఏకే బ్రౌనీ, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి ఉదిత్ రాజ్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ భార్య తేజస్వీ భూషణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ భార్య కల్పన, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్, చరిత్రకారుడు రోమిలా థాపర్, ఢిల్లీ ఆర్చ్‌బిషప్ అనిలకౌటో, సీనియర్ సీపీఐ నేత అన్నీ రాజాలకూ తాజాగా ఎస్‌ఐఆర్ నోటీస్‌లు పంపించారు.


