ఇది అమిత్ షా ప్రేరేపిత తొలగింపు చర్యేనన్న జైరాం రమేశ్
తెలంగాణలో 48.90 శాతం,
ఏపీలో 21.17% ఓట్లకు ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ముసుగులో కేంద్ర ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని కాంగ్రెస్ ఆరోపించింది. కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి అధికారులు అక్రమంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ‘‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తోంది. ఎస్‌ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
కానీ ఇప్పుడు అది షా ప్రోద్భలంతో జరుగుతున్న ఓట్ల తొలగింపు(షా ఇన్‌స్టిగేటెడ్ రిమూవల్–ఎస్‌ఐఆర్) ప్రక్రియగా తయారైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఎస్‌ఐఆర్ తొలి రెండు దశల్లోనే ఏకంగా 7.8 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందున్న మొత్తం ఓటర్లలో ఇది దాదాపు 13 శాతానికి సమానం. మూడో దశలోనూ భారీ ఎత్తున ఓట్ల గల్లంతు జరుగుతోంది.
మూడో దశలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 36.06 కోట్ల మంది ఓటర్లను పరిశీలించగా, అందులో ఇప్పటికే 6.18 కోట్ల మంది పేర్లను తొలగించారు. ఓటరు జాబితాలో పేర్లను కొనసాగించుకోవాలంటే అదనపు పత్రాలు సమరి్పంచాలంటూ మరో 5.43 కోట్ల మందికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సరైన సమయంలో ఈ పత్రాలు సమరి్పంచకపోతే ఈ 15 శాతం మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదముంది’’ అని జైరాం ఆందోళన వ్యక్తంచేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోప్యత
‘‘ఈ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించింది. కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తొలగింపు ప్రమాదం ఉన్న ఓటర్ల జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచగా, ఢిల్లీలో ప్రజల ఒత్తిడి మేరకు సెపె్టంబర్ 19న విడుదల చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ జాబితాలను కనీసం బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు’’ అని దుయ్యబట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఓట్లు కోల్పోయిన, తొలగింపు ప్రమాదం ఉన్న ఓటర్ల గణాంకాలను జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ జాబితాలో ఢిల్లీ 53.73 శాతం ఓట్ల తొలగింపు ముప్పుతో తొలి స్థానంలో ఉండగా, చండీగఢ్ 52.58 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.
తెలంగాణలో ఏకంగా 48.90 శాతం మంది పేర్లు గల్లంతవడమో, నోటీసులు అందుకోవడమో జరిగి జాబితాలో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. జార్ఖండ్‌లో 39.57 శాతం, హరియాణాలో 37.5 శాతం, ఉత్తరాఖండ్‌లో 35.71 శాతం, మేఘాలయలో 35.36 శాతం, మహారాష్ట్రలో 33.88 శాతం ఓట్లకు గండం పొంచి ఉందని వివరించారు. కర్ణాటకలో 27.6 శాతం, ఒడిశాలో 23.67 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 21.17 శాతం, పంజాబ్‌లో 15.23 శాతం మేర ఓటర్లు జాబితా నుంచి గల్లంతయ్యే ప్రమాదంలో ఉన్నారని ఆరోపించారు.
అద్వానీకి సర్ నోటీసు
కేంద్ర మంత్రి జైశంకర్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా
న్యూఢిల్లీ: ఢిల్లీలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వేలో పలువురు ప్రముఖులకు సైతం నోటీసులు జారీ అయ్యాయి. బీజేపీ దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి సైతం ఎస్‌ఐఆర్ నోటీస్ వచి్చంది. సర్ కింద అందజేసిన ధ్రువీకరణ పత్రాల్లో వ్యత్యాసాలున్నాయని, మరిన్ని ఆధారాలను సమర్పించాలని అధికారులు వారిని కోరారు. 98 ఏళ్ల అద్వానీతోపాటు ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతికలకూ ఈ నోటీసులు అందాయి. 2002 నాటి సర్ ఓటరు జాబితాలో వీరి పేర్లు లేవని పేర్కొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధూ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, ఆయన భార్య క్యోకో, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, మాజీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ జగదీశ్ కుమార్, మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా, సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పండే, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు సైతం ఎస్‌ఐఆర్ నోటీసులు వచ్చాయి.
సిసోడియా, భార్య సీమ, కుమారుడు మీర్‌కూ నోటీసులందాయి. తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసాలున్నాయంటూ మీర్‌కు పంపిన నోటీసులో పేర్కొన్నారు. సిసోడియా భార్య సీమకు పంపిన నోటీసులో ధ్రువీకరణ పత్రాలతో ఆమె పేరు సరిపోలడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీలో నోటీస్‌లు అందుకున్న వాళ్ల పేర్లన్నీ ఢిల్లీ శాసనసభ పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ ఆర్మీ చీఫ్‌కు సైతం..
భారత ఆర్మీ మాజీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్యకు సైతం ఎస్‌ఐఆర్ నోటీసులు వచ్చాయి. మంత్రి ఎస్. జైశంకర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్, ఆయన కుటుంబసభ్యులకు, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కూ ఈసీ అధికారులు ఎస్‌ఐఆర్ నోటీసులు అందజేశారు.


