సరఫరా తగ్గుదలతో రాష్ట్రంలో భగ్గుమంటున్న ధర
హైదరాబాద్‌లో కిలో రూ. 60, తెల్ల ఉల్లి రూ. 100
గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే దాదాపు 94 శాతం ధరల పెరుగుదల
వర్షాల్లేక నాసిక్, కర్నూలులో ఉల్లి పంట దిగుబడి తగ్గడమే ప్రధాన కారణం
మరో నెల దాకా ఇదే పరిస్థితి తప్పదంటున్న మార్కెట్ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా సరఫరా తగ్గుదల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో జూలైలో కిలో రూ. 20 పలికిన ఉల్లి.. ప్రస్తుతం రూ. 60కి చేరింది. ఇక తెల్ల ఉల్లి కిలో రూ. 100 మార్కుకు చేరుకుంది. మంచిర్యాలలో నెల రోజుల వ్యవధిలో రూ. 30 నుంచి రూ. 70కి పెరిగింది. మలక్‌పేటలోని హోల్‌సేల్ మార్కెట్ అయిన గంజ్ మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి రూ. 5,200 నుంచి రూ. 5,500 దాకా పలుకుతోంది. మలక్‌పేట మార్కెట్‌కు గతేడాది ఆగస్టులో 2,54,120 క్వింటాళ్ల ఉల్లి వస్తే ఈ ఏడాది 1,99,686 క్వింటాళ్లే వచ్చాయి. రోజూ 25 వేల బస్తాలకు బదులు 15 వేల బస్తాలే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల సగటు రిటైల్ ధర సెప్టెంబర్ 16న కిలోకు రూ. 53.84గా నమోదైంది. గతేడాది అదే రోజున కిలో ధర రూ. 27.71గానే ఉండేది. అంటే ఏడాది వ్యవధిలో ఉల్లి సగటు చిల్లర ధర దాదాపు 94 శాతం పెరిగింది.
తగిన వర్షాల్లేక..
ఈ ఖరీఫ్ సీజన్‌లో దేశంలోని ప్రధాన ఉల్లి సాగు ప్రాంతాలైన మహారాష్ట్రలోని నాసిక్, ఏపీలోని కర్నూలుతోపాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల దిగుబడి తగ్గింది. దీనికితోడు గత రబీ సీజన్‌లో అధిక తేమ వల్ల నిల్వ ఉంచిన పంట సైతం దెబ్బతిన్నది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయి. మరోవైపు ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ సరఫరాను 19 నగరాలకు విస్తరించింది. ఉత్పత్తి ప్రాంతాల నుంచి ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిని తరలించేందుకు రైల్వే ర్యాక్‌లు, కాండా ఎక్స్‌ప్రెస్, 30కిపైగా ట్రక్కులను వినియోగిస్తోంది. నాసిక్ నుంచి పంపిన రైలు ర్యాక్‌ల ద్వారా ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలకు ఇప్పటికే చేరింది. అలాగే ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ. 35కే విక్రయిస్తోంది. కానీ బఫర్ స్టాక్ నుంచి సరఫరా చేసిన ఉల్లి.. ప్రతి మార్కెట్‌కు సమానంగా చేరకపోవడం సమస్యగా మారింది. అందుకే సాధారణ వినియోగదారులు బహిరంగ మార్కెట్లలో ఉల్లిని దాదాపు రెండింతల ధరకు కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్త ఖరీఫ్ పంట మార్కెట్‌లోకి పూర్తి స్థాయిలో వచ్చే వరకు (మరో నెల రోజులపాటు) ఉల్లి ధరల మంట తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


