పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణ | CM Revanth Reddy Says Let us shape state into World will be proud of | Sakshi
Sakshi News home page

పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణ

Sep 18 2026 1:12 AM | Updated on Sep 18 2026 1:12 AM

CM Revanth Reddy Says Let us shape state into World will be proud of

తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం: సీఎం రేవంత్‌రెడ్డి

అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం 

ఆ చరిత్ర, ఉద్యమాల ఫలాలు ప్రజల్లో కనిపించాలి 

రైతుకు భరోసా ఉండాలి.. మహిళలు ఆర్థికంగా ఎదగాలి 

పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి 

యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి 

నిజాం పాలనలో పలు రంగాల్లో హైదరాబాద్‌ పురోగతి 

ప్రజా పాలన దినోత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగం  

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రజా పాలనకు పునాదులని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘సెప్టెంబర్‌ 17 మనకు గతాన్ని మాత్రమే గుర్తు చేసే రోజు కాదు. మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక ఘట్టం. సకల జనుల ఉద్యమం, ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఆ చరిత్ర, ఆ ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి. అభివృద్ధి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ చేరాలి. చరిత్రను మరిచిపోం. చరిత్ర దగ్గరే ఆగిపోం. ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో... తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం’అని అన్నారు. 

నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో గురువారం జరిగిన ప్రజా పాలన దినోత్సవాల్లో ముఖ్యమంత్రి మువ్వన్నెల జెండా ఎగురవేశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులందరికీ ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అని గుర్తుచేశారు. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించిందన్నారు. సమ్మక్క–సారలమ్మల పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు అన్యాయాన్ని ఎదిరించడం ఈ గడ్డ స్వభావం అని కితాబిచ్చారు. ఆ సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 
 
నిజాం పాలనలో పురోగతి.. 
‘భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రం నిజాం పాలనలోనే కొనసాగింది. నిజాం పాలనలో హైదరాబాద్‌ పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించింది. నిజాం పాలనలో హైదరాబాద్‌ ప్రపంచస్థాయి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, అణిచివేత తీవ్రంగా ఉండేది. చివరి దశలో రజాకార్ల దౌర్జన్యాలు ప్రజలను కల్లోలపరిచాయి. భారతదేశంలో అంతర్భాగం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలపడింది. రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో యోధులు పోరాటాలకు నాయకత్వం వహించారు. హైదరాబాద్‌ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాలు, పోరాటాల నేపథ్యంలో ఆనాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో ఆపరేషన్‌ పోలో సైనిక చర్య చేపట్టారు. ఏడో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైంది. అది నిజాం పాలకుల అధికారం ముగిసిన రోజు మాత్రమే కాదు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం. అందుకే సెప్టెంబర్‌ 17ను మనం ‘ప్రజా పాలన దినోత్సవం’గా జరుపుకుంటున్నాం’అని రేవంత్‌ రెడ్డి వివరించారు.  

వరంగల్‌లో టిమ్స్‌ ఆసుప్రతి.. 
ఆరోగ్య రంగానికీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ‘అల్వాల్, ఎల్బీనగర్‌ టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. వరంగల్‌లో 2,000 పడకలతో టిమ్స్‌ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తాం. రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపించాం. ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించాం. హైదరాబాద్‌ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలనే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రారంభించాం. 55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేస్తాం’అని తెలిపారు. 

రహదారులు అభివృద్ధికి సూచిక.. 
డిసెంబర్‌లో నిర్వహించే ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026 సందర్భంగా ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని సీఎం తెలిపారు. ‘ఫ్యూచర్‌ సిటీలో టీసీఎస్‌ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్‌ ఇప్పటికే డేటా సెంటర్‌ నిర్మాణం చేపట్టింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు, డ్రైపోర్టులు, హైదరాబాద్‌–నాగపూర్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–విజయవాడ పారిశ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీరాజ్‌ పరిధిలో రూ.6,294 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నాం’అని సీఎం వివరించారు.  

సీఎం ఇంకా ఏమన్నారంటే... 
తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి. ంకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళా మార్ట్‌లు, పెట్రోల్‌ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులతో మహిళల ఆదాయం పెంచుతున్నాం. మహిళను కేవలం లబ్ధిదారుగా కాకుండా.. ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగా నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. 
⇒ కుల, మత భేదాలు లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మిస్తున్నాం.  
⇒ ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాం. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేశాం. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశాం.  
⇒ ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ.22,500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించాం. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించాం. 
⇒ ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఆహార కల్తీని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని సీఎం తేల్చిచెప్పారు. అందుకే టీజీ సేఫ్‌ ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement