సాక్షి,నిజామాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ ఆర్ ఆర్ సెంటర్‌లో హరిబాబును గుర్తు తెలియని యువకుడు కొబ్బరి కాయలు కోసే కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. యూట్యూబర్ వైష్ణవి కేసుకు.. హరిబాబు హత్యకు సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల మేరకు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి (24), చిథారి హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వైష్ణవి 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 17న తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. ఆమెను భర్త హరిబాబు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు.
అదనపు కట్నం కోసం హరిబాబు, అతని కుటుంబ సభ్యులు (తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్) వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించారని పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయమై మార్చి 16 రాత్రి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరిబాబును అదే రోజు కోరుట్ల శివారులో అదపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే వేధింపులకు సంబంధించి అతని కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేగింది. హరిబాబు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి : నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త


