నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త | Tragic incident of youtuber vaishnavi | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త

Mar 18 2026 4:23 AM | Updated on Mar 18 2026 4:23 AM

Tragic incident of youtuber vaishnavi

మృతురాలు యూట్యూబర్‌

ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం 

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఘటన

కోరుట్ల రూరల్‌: నాలుగు నెలల గర్భిణిని భర్త దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌లో జరిగింది. కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్‌ గ్రామానికి చెందిన యూట్యూబర్‌ గంధం వైష్ణవి ఏడాదిన్నర కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్న వారిద్దరి మధ్య ఇటీవల తరచూ చిన్నచిన్న గొడవలు తలెత్తాయి. నాలుగు నెలల కిందట వైష్ణవి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వైష్ణవి మాదాపూర్‌లోని తల్లి గారింట్లోనే ఉంటోంది. 

కోరుట్ల ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగం చేసిన హరిబాబు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. భార్య మాదాపూర్‌లోనే ఉండటంతో హరిబాబు కూడా అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో హరిబాబు భార్యను కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మంగళవారం వేకువజామున ఎవరూ నిద్రలేవక ముందే హరిబాబు గదికి బయట నుంచి గడియవేసి వెళ్లిపోయాడు. 

ఉదయం వైష్ణవి తల్లిదండ్రులు అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా మృతిచెంది ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు హరిబాబు పరారీలో ఉన్నాడు. అదనపు కట్నం కోసమే కూతురు వైష్ణవిని చంపారని.. ఆమె మృతికి కారణమైన భర్త హరిబాబు, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు గంధం ప్రసాద్‌–రాణి డిమాండ్‌ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మెట్‌పల్లి డీఎస్పీ రాములు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement