ఎల్‌నినో ఎఫెక్ట్‌: అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు! | El Niño Effect: No Atlantic Hurricanes Yet, First in 60 Years | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ఎఫెక్ట్‌: అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు!

Sep 17 2026 12:45 PM | Updated on Sep 17 2026 1:21 PM

El Niño Effect: No Atlantic Hurricanes Yet, First in 60 Years

అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క హరికేన్ కూడా ఏర్పడలేదు. 1966 తర్వాత ఇంత సుదీర్ఘకాలం హరికేన్ లేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసిన ‘ఎల్‌నినో’ ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. జూన్ 1న ప్రారంభమైన ప్రస్తుత హరికేన్ సీజన్‌లో అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క భారీ హరికేన్ కూడా ఏర్పడలేదు. సెప్టెంబర్ 15 వరకు హరికేన్‌లు ఏర్పడకపోవడం అరుదైన పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. 2026లో కనిపిస్తున్న బలమైన ఎల్‌నినో దీనికి కారణమని వారు చెబుతున్నారు.

హరికేన్‌లు భారీ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం 1966 తర్వాత అట్లాంటిక్‌లో హరికేన్ ఏర్పడకుండా కొనసాగుతున్న సుదీర్ఘ విరామం ఇదే. 1991-2020 మధ్య వాతావరణ గణాంకాల ప్రకారం.. సాధారణంగా ప్రతి సీజన్‌లో తుఫాను జూన్‌లో ఏర్పడుతుంది. తొలి హరికేన్ సాధారణంగా ఆగస్టు ప్రారంభంలో లేదా మధ్యలో ఏర్పడుతుంది. గతంలోనూ హరికేన్‌లు ఆలస్యంగా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. 2022లో డేనియల్ సెప్టెంబర్ 2న ఏర్పడి ఆ ఏడాది అట్లాంటిక్‌లో తొలి హరికేన్‌గా నిలిచింది. 2013లో హంబర్టో సెప్టెంబర్ 11న ఏర్పడి ఆ సీజన్‌లో తొలి హరికేన్‌గా నమోదైంది.

ఈ ఏడాది బలమైన ఎల్‌నినో కారణంగా అట్లాంటిక్‌లో తక్కువ సంఖ్యలో తుఫానులు ఏర్పడతాయని వాతావరణశాఖ ముందుగానే అంచనా వేసింది. ఈ సీజన్‌లో 7 నుంచి 13 పేరున్న తుఫానులు ఏర్పడవచ్చని అంచనా వేయగా.. ఇప్పటివరకు ఆర్థర్, బెర్తా, క్రిస్టోబల్, డాలీ, ఎడ్వార్డ్ అనే ఐదు ఉష్ణమండల తుఫానులు మాత్రమే ఏర్పడ్డాయి. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలోని కొంత ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటమే ఎల్‌నినో లక్షణం. వేడెక్కిన సముద్ర జలాలు తూర్పు పసిఫిక్‌లో ఉష్ణమండల తుఫానుల అభివృద్ధికి అనుకూలిస్తాయి. అయితే అట్లాంటిక్‌లో ఎల్‌నినో ప్రభావంతో సముద్ర జలాలు చల్లబడటంతో ఉష్ణమండల తుఫానులు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు తగ్గుతాయి.

ఇదీ చదవండి: వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాకు భారీ హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement