అట్లాంటిక్ మహాసముద్రంలో కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ తీరానికి ఆవల ఉన్న ఈ దీవి పేరు ‘క్విర్పాన్ ఐలండ్’. అయితే, ఇది దయ్యాల దీవిగా పేరు మోసింది. దీనికి దయ్యాల దీవిగా పేరు రావడం వెనుక పదహారో శతాబ్దినాటి సంఘటన ఒకటి కారణమని చెబుతారు. ఫ్రెంచ్ నావికుడు కెప్టెన్ జ్హా ఫ్రాంకోయిస్ 1542లో మందీ మార్బలంతో నౌకాయాత్రకు బయలుదేరాడు.
అదే నౌకలో ఫ్రాంకోయిస్ బంధువైన మార్గరిట్ అనే మహిళ మరో యువనావికుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఫ్రాంకోయిస్ ఆమెను శిక్షించడం కోసం మార్గరిటేను, ఆమెకు సన్నిహితుడైన యువనావికుడిని, ఆమె సేవకుడిని ఈ నిర్జన దీవిలో విడిచి వెళ్లిపోయాడు. ఒంటరి దీవిలో వారు అగచాట్లు పడుతూ, కొన్నాళ్లకు మరణించారు. ఇప్పటికీ వారి ఆత్మలు ఈ దీవిలోనే సంచరిస్తుంటాయని చెబుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో కొందరు ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడకు రాకపోకలు జరుపుతున్నారు.


