వెంటాడిన 3,700 ఏళ్ల నాటి వైరస్.. 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి! | Ancient 3,700-Year-Old Virus Linked To Sheep And Goat Deaths In Greece Resurfaces In New Study, Read Story For Full Details | Sakshi
Sakshi News home page

వెంటాడిన 3,700 ఏళ్ల నాటి వైరస్.. 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి!

Sep 17 2026 8:05 AM | Updated on Sep 17 2026 9:17 AM

3700 Year Old Virus Traced Through Medieval Books

ఏథెన్స్: గ్రీస్‌లో 2025లో, అలాగే ఈ ఏడాది వైరస్‌ వ్యాప్తి కారణంగా దాదాపు 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి చెందడం లేదా వ్యాధి నియంత్రణలో భాగంగా వధించాల్సి వచ్చింది. అత్యధిక మరణాల రేటు కలిగిన ఈ వైరస్‌ సుమారు 3,700 ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతన గ్రంథాలు రాసేందుకు ఉపయోగించిన గొర్రె చర్మపు పార్చ్‌మెంట్‌లో ఈ వైరస్‌కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్‌కు చెందిన మాలిక్యులర్ పాపులేషన్ జెనెటిక్స్ ల్యాబ్‌ పరిశోధకుడు లూయిస్ ఎల్‌హోట్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గొర్రె చర్మంపై రాసిన యార్క్ గాస్పెల్స్‌ సహా పలు చారిత్రక పత్రాలను పరిశీలించారు. అంతేకాకుండా కాంస్య యుగానికి చెందిన గొర్రెల దంతాలను కూడా విశ్లేషించారు. వైరస్‌కు సంబంధించిన అత్యంత పురాతన ఆధారాలు ఈ దంతాల్లోనే లభించాయని పరిశోధకులు తెలిపారు.

కాంస్య యుగంలోనే యూరేషియన్ స్టెప్పీ ప్రాంతంలోని పెంపుడు గొర్రెల మందల్లో ప్రస్తుతం అత్యంత అంటువ్యాధిగా, తీవ్ర ప్రభావం చూపే వ్యాధికారక వైరస్‌ ఉన్నట్లు గుర్తించినట్లు ఎల్‌హోట్ తెలిపారు. స్టెప్పీ ప్రాంతంలోని ఆ కాలానికి చెందిన గొర్రెల్లో వ్యాధికారకానికి సంబంధించిన ఆధారాలు లభించడం.. అక్కడి పశుపోషక సమాజాలు అనేక రకాల పశు వ్యాధులతో పోరాడి ఉండొచ్చని సూచిస్తోందన్నారు.

మధ్యయుగ కాలంలో జంతువుల చర్మంతో తయారు చేసిన పత్రాల్లో ఎస్‌పీపీవీ జన్యువులు పెద్ద సంఖ్యలో కనిపించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఆ కాలంలో గొర్రెలకు ఈ వైరస్‌ సోకడం యూరప్‌ సమాజాలకు తరచూ ఎదురైన సమస్యగా భావిస్తున్నారు.

షీప్‌పాక్స్‌కు కారణమయ్యే క్యాప్రిపాక్స్‌వైరస్‌.. మనుషుల్లో మశూచికి కారణమయ్యే వేరియోలా వైరస్‌కు దగ్గరి సంబంధం కలిగి ఉంది. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో రోమ్‌లో ఈ వ్యాధికి సంబంధించిన తొలి లిఖిత ఆధారాలు లభించాయి. రచయిత లూసియస్ కొలుమెల్లా గొర్రెల చర్మంపై ఏర్పడే గాయాలను ‘పస్ట్యూల్స్‌’గా పేర్కొన్నారు. పశువుల లెక్కలు, వ్యవసాయ గ్రంథాల్లో ఈ వ్యాధిని ‘పాక్స్‌’ లేదా ‘వేరియోలా’గా కూడా పేర్కొన్నారు. వ్యాధి విజృంభించిన ప్రతిసారీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గినట్లు ఆ రికార్డులు సూచిస్తున్నాయి.

మధ్యయుగ యూరప్‌లో పశువులకు అర్థంకాని వ్యాధులు సోకినప్పుడు వాటిని చేతబడి ప్రభావంగా కూడా ప్రజలు భావించేవారు. షీప్‌పాక్స్‌ వైరస్‌ జంతువుల చర్మంలో నిలిచిపోయేది. ఆ చర్మాన్ని పార్చ్‌మెంట్‌ తయారీకి ఉపయోగించడంతో శాస్త్రవేత్తలు పురాతన పత్రాల ద్వారా వైరస్‌ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ వ్యాధి తూర్పు యూరప్‌, కాకేసస్‌ స్టెప్పీ ప్రాంతాల్లో తొలుత ఉద్భవించి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి ప్రజలు గొర్రెలను దుస్తులు, మాంసం, పాల ఉత్పత్తుల కోసం పెంచేవారు. పెద్ద నివాస ప్రాంతాలు లోహాలు, సిరామిక్ వస్తువుల వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు ఈ వస్తువులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, విదేశీ వ్యాపారులు తెలియకుండానే వైరస్‌ను తమ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఇతర గొర్రెల మందలతో కలవడం కూడా వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చన్నారు.

చారిత్రక పత్రాలను పరిశీలించిన ఎల్‌హోట్‌కు.. చర్మం బయటి భాగంతో పోలిస్తే మాంసం వైపు ఎక్కువ వైరస్‌ డీఎన్‌ఏ కనిపించింది. గొర్రెలను పెంపుడు జంతువులుగా మార్చిన సమయంలోనే షీప్‌పాక్స్‌ ఉద్భవించి ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాల్లో జ్వరం, ఆకలి తగ్గడం, కళ్ల నుంచి స్రావాలు రావడం, ఉన్ని లేని ప్రాంతాల్లో చర్మంపై గాయాలు ఏర్పడటం కనిపించాయి.

ఇదీ చదవండి: ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement