Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన యువరాజు | Abu Dhabi Crown Prince Turns Back to Thank Indian Driver in Delhi | Sakshi
Sakshi News home page

Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన యువరాజు

Sep 14 2026 2:00 PM | Updated on Sep 14 2026 2:05 PM

Abu Dhabi Crown Prince Turns Back to Thank Indian Driver in Delhi

పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ ఖలీద్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.

18వ బ్రిక్స్‌ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్‌ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్‌ ఖలీద్‌.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్‌కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.

వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్‌ భారతీయుడని ఏఎన్‌ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘చిన్న పని.. పెద్ద మనసు!’
యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్‌’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్‌ జాయెద్‌ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.

భారత్‌ పర్యటనలో భాగంగా షేక్‌ ఖలీద్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన భేటీలో భారత్‌–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.

18వ బ్రిక్స్‌ సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్‌ రెసిలియెన్స్‌, ఇన్నోవేషన్‌, కోఆపరేషన్‌ అండ్‌ సస్టైనబిలిటీ’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.

అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్‌కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement