వినాయకుడికి అంత రహస్య పూజలెందుకు? | Hidden Ganesha: The Mysterious Story of Kangiten and His Secret Worship | Sakshi
Sakshi News home page

వినాయకుడికి అంత రహస్య పూజలెందుకు?

Sep 14 2026 1:50 PM | Updated on Sep 14 2026 1:53 PM

Hidden Ganesha: The Mysterious Story of Kangiten and His Secret Worship

వినాయక చవితి వచ్చిందంటే మన దేశంలో ఎక్కడ చూసినా గణనాథుడి సందడే కనిపిస్తుంది. వీధివీధినా మండపాలు.. ఇంటింటా బొజ్జ గణపయ్య ప్రతిమలు.. ఘనంగా పూజలు.. నైవేద్యాలు.. నిమజ్జనాలు. కానీ మనకు ఎంతో పరిచయమైన ఈ విఘ్నేశ్వరుడు మరో దేశంలో మాత్రం పూర్తిగా భిన్నమైన రూపంలో పూజలు అందుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా.. ఆ గణేశుడి విగ్రహాన్ని అందరికీ చూపించరు. పూజా విధానాలనూ రహస్యంగానే నిర్వహిస్తారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఆ వింత గణేశుడి కథేంటి?

జపాన్‌లో గజరాజు రూపంతో ఉన్న దైవాన్ని పూర్తి భిన్నమైన సంప్రదాయం ఉంది. అక్కడ ఆయన్ని కాంగిటెన్‌.. షోటెన్‌ అనే పేర్లతో పూజిస్తారు. అంతేకాదు.. అక్కడి ఓ ప్రత్యేక రూపంలో రెండు ఏనుగు ముఖాలున్న దేవతలు ఒకరినొకరు కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించరు. పూజా విధానాలను కూడా రహస్యంగానే నిర్వహిస్తారు. జపాన్‌ బౌద్ధ సంప్రదాయాల్లో వినాయకుడి కథ ఆసక్తికరమైన మలుపులతో కనిపిస్తుంది.

తొలుత దుష్ట శక్తిగా..
కొన్ని పురాతన బౌద్ధ గ్రంథాల్లో కాంగిటెన్‌ అనేది అడ్డంకులు సృష్టించే దుష్ట శక్తిగా పేర్కొని ఉంది. అతడిని ‘గజరాజుగా’, మనుషులకు ఇబ్బందులు కలిగించే శక్తిగా భావించేవారు. అందుకే అతడిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక మంత్రాలు, ఆచారాలు ఉపయోగించేవారు. అయితే తర్వాతి సంప్రదాయాల్లో కథ పూర్తిగా మారుతుంది.

వినాయకుడి ఉగ్ర స్వభావాన్ని శాంతింపజేయడానికి కన్నోన్‌.. స్త్రీ వినాయక రూపంలో ప్రత్యక్షమయ్యాడని ఓ కథనం చెబుతుంది. ఆమెను చూసిన వినాయకుడు ఆకర్షితుడవుతాడు. అయితే ఆమెను తన సహచరిగా అంగీకరించాలంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలని షరతు పెడుతుంది. వినాయకుడు అంగీకరించడంతో ఆమె అతడిని కౌగిలించుకుంటుంది. ఆ క్షణంతో అతడి ఉగ్ర స్వభావం శాంతించి.. దుష్ట శక్తి నుంచి రక్షక దేవతగా మారినట్లు కథనం.

అందుకే కౌగిలింత రూపం!
ఈ కథతోనే కాంగిటెన్‌ ప్రత్యేక రూపానికి సంబంధించిన భావనను అనుసంధానిస్తారు. రెండు ఏనుగు ముఖాలున్న రూపాలు ఒకదానినొకటి కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తాయి. ఇది కేవలం ప్రేమకు సంబంధించిన ప్రతీకగా కాకుండా.. భిన్న శక్తుల ఏకత్వం, ఉగ్రతను శాంతింపజేయడం, సామరస్యం, సంపూర్ణతకు సంకేతంగా వివరిస్తారు. అందుకే ఈ రూపం సాధారణ గణేశుడి విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది.

ఎందుకంత రహస్య పూజ?
కాంగిటెన్‌ ఆరాధన జపాన్‌లోని ఎసోటెరిక్‌ బౌద్ధ సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఒకప్పుడు దుష్ట శక్తిగా భావించిన వినాయకుడి ఆరాధనలో ప్రత్యేక మంత్రాలు, దీక్షతో చేసే కర్మకాండలు అభివృద్ధి చెందాయి. అందుకే కాంగిటెన్‌ విగ్రహాలను చాలాచోట్ల తెర వెనుక లేదంటే ప్రత్యేక పెట్టెల్లో ఉంచుతారు. సాధారణ భక్తులకు వాటిని నేరుగా చూపించరు. కొన్ని అత్యంత ముఖ్యమైన పూజలను దీక్ష పొందిన బౌద్ధ సన్యాసులే నిర్వహిస్తారు. ఈ రహస్యత్వమే కాంగిటెన్‌ ఆరాధనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది.
 


పూజలు, నైవేద్యం కూడా చాలా ప్రత్యేకం..
కాంగిటెన్‌కు సమర్పించే నైవేద్యాల్లో డైకాన్‌ ముల్లంగికు ప్రత్యేక స్థానం ఉంది. ముల్లంగితో పాటు జపాన్‌ సంప్రదాయ బియ్యం మద్యం సేక్‌ను కూడా సమర్పిస్తారు. ఇక అత్యంత ఆసక్తికరమైన నైవేద్యం ‘కాంగిదాన్‌’. ఇది ఎర్రబీన్స్‌ పూర్ణంతో నింపి నూనెలో వేయించే తీపి పదార్థం. భారతీయ సంప్రదాయంలోని మోదకాన్ని పోలిన ఈ స్వీట్‌ను కాంగిటెన్‌కు ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు.

డైకాన్‌ సమర్పణ వెనుక కూడా ఒక ప్రతీకాత్మక అర్థం ఉంది. బౌద్ధ సంప్రదాయంలో మనిషిని వేధించే ప్రతికూల భావాల్లో ఒకటైన ద్వేషాన్ని తొలగించడాన్ని ముల్లంగి సమర్పణ సూచిస్తుందని భావిస్తారు. అందుకే జపాన్‌లోని కాంగిటెన్‌ ఆలయాల్లో డైకాన్‌ బొమ్మలు, గుర్తులు కనిపిస్తుంటాయి. కొన్ని ఆలయాల్లో ముల్లంగికి సంబంధించిన ప్రత్యేక ఉత్సవాలూ నిర్వహిస్తారు.

ఇక కాంగిటెన్‌ పూజల్లో అత్యంత రహస్యమైన ఆచారాల్లో ‘ఆయిల్‌ బాత్‌ రిట్యువల్‌’ (Yokuyu-ku) ఒకటి. విగ్రహంపై పవిత్రమైన నువ్వుల నూనెను నిర్దిష్ట విధానంలో పోస్తూ చేసే ఈ పూజను సాధారణంగా దీక్ష పొందిన సన్యాసులే నిర్వహిస్తారు. వినాయకుడి పాత దుష్ట స్వభావాన్ని శుద్ధి చేసి.. అతడిని ధర్మ మార్గంలోకి తీసుకువచ్చిన ప్రక్రియకు ఇది ప్రతీకగా భావిస్తారు.

అలా మన దగ్గర విఘ్నాలను తొలగించే గణపయ్య.. జపాన్‌లో మాత్రం ఒకప్పుడు విఘ్నాలు సృష్టించే శక్తిగా పేరొందాడు. కాలక్రమంలో కాంగిటెన్‌ అనే రహస్య దైవంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఒకే గణేశుడికి దేశానికో రూపం.. సంప్రదాయానికో కథ.. ఇదే వినాయక ఆరాధనలోని విశేషం!.

ఇదీ చదవండి: ఎల్లలు లేవని దేవుడు ఈయన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement