సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#GaneshChaturthi
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026
అంతకు ముందు.. ఓ సందేశంలో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే వైఎస్ జగన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు.


