బిగ్‌బాస్‌: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు! | Bigg boss 20 Mary Koms team Responds to Backlash over women Athletes Remark | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు!

Sep 14 2026 8:40 AM | Updated on Sep 14 2026 8:49 AM

Bigg boss 20 Mary Koms team Responds to Backlash over women Athletes Remark

బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ‘బిగ్‌బాస్‌ 20’(హిందీ)లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. రింగ్‌ వెలుపల ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ రియాలిటీ షోలో ఇటీవల ఓ సంభాషణ వివాదానికి దారితీసింది. మహిళా క్రీడాకారిణులపై మేరీ కోమ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆమె టీమ్‌ స్పందించి వివరణతో పాటు క్షమాపణలు తెలిపింది.

సానియా, సైనా ప్రస్తావనతో మొదలైన చర్చ
‘బిగ్‌బాస్‌ 20’లో సహచర కంటెస్టెంట్‌ ఖాజీ తౌకీర్‌తో మేరీ కోమ్‌ సంభాషించారు. భారత మహిళా క్రీడాకారిణులు సాధించిన విజయాల గురించి చర్చ సందర్భంగా ఖాజీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ సైనా నెహ్వాల్‌ పేర్లను ప్రస్తావించారు. సానియా, సైనా క్రీడల్లో గొప్పగా రాణించారని ఆయన పేర్కొన్నారు.

‘నా స్థాయిలో ఎవరూ సాధించలేదు’
ఖాజీ తన మాటలు పూర్తిచేయకముందే మేరీ కోమ్‌ జోక్యం చేసుకుని.. ‘నా లాంటి విజయాలను ఎవరూ సాధించలేదు’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆమె తన సొంత బాక్సింగ్‌ విజయాలను ప్రస్తావించడంతో.. ఇతర భారత మహిళా క్రీడాకారిణుల విజయాలను తక్కువ చేసి చూపినట్లుగా కొందరు ప్రేక్షకులు భావించారు.

ఆన్‌లైన్‌లో వైరల్‌గా వీడియో క్లిప్పులు
ఈ సంభాషణకు సంబంధించిన క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. మేరీ కోమ్‌ కెరీర్‌ను అభినందించే క్రమంలో ఇతర ప్రముఖ మహిళా క్రీడాకారిణుల విజయాలను తగ్గించి చూపకూడదంటూ పలువురు విమర్శలు చేశారు.

మేరీ కోమ్‌ టీమ్‌ వివరణ
ఈ నేపథ్యంలో మేరీ కోమ్‌ అధికారిక ఖాతా ద్వారా ఆమె టీమ్‌ వివరణ ఇచ్చింది. ‘మేరీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమాపణలు. మరో క్రీడాకారిణి ప్రయాణాన్ని కించపరచడం లేదా పోల్చడం ఆమె ఉద్దేశం కాదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రతి క్రీడాకారిణిపై మేరీకి ఎంతో గౌరవం ఉంది’ అని పేర్కొంది.

ప్రతి పతకం దేశానికి గర్వకారణమే
‘ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకమైనది. ప్రతి విజయం ముఖ్యమైనదే. ప్రతి పతకం భారత్‌ను గర్వపడేలా చేస్తుంది’ అని మేరీ కోమ్‌ టీమ్‌ స్పష్టం చేసింది.

‘బిగ్‌బాస్‌ 20’ సెప్టెంబర్‌ 6, 2026న ప్రారంభమైంది. సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌ జియో హాట్‌స్టార్‌లో ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్‌ అవుతోంది. కలర్స్‌ టీవీలో రాత్రి 10:30 గంటలకు ప్రసారం చేస్తున్నారు. ఈ సీజన్‌లో రెండు ఇళ్ల ఫార్మాట్‌తో పాటు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లకు తిరిగి వచ్చే అవకాశం కల్పించే విధానం, ఎలిమినేషన్లను ప్రభావితం చేసే ‘వరదాన్‌’/ఎక్స్‌ట్రా లైఫ్‌ ట్విస్ట్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: 45 ఏళ్లుగా గణేశ్‌ వేడుకల్లో మారుమోగుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement