నీట్‌ నిరసనలతో వైరల్‌.. ‘బిగ్‌బాస్‌’లో రియాకు చుక్కెదురు | Riya Ahir Rejected from Bigg Boss After NEET Protest Fame | Sakshi
Sakshi News home page

నీట్‌ నిరసనలతో వైరల్‌.. ‘బిగ్‌బాస్‌’లో రియాకు చుక్కెదురు

Sep 7 2026 11:01 AM | Updated on Sep 7 2026 11:09 AM

Riya Ahir Rejected from Bigg Boss After NEET Protest Fame

నీట్‌ నిరసనల సందర్భంగా వైరల్‌గా మారిన ఇన్‌ఫ్లుయెన్సర్‌, నటి రియా అహిర్‌కు ‘బిగ్‌బాస్‌ 20’లో నిరాశ ఎదురైంది. ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన విద్యార్థుల ఆందోళన సమయంలో విద్యార్థులతో కూడిన పోలీసు వ్యాన్‌ను ఆపేందుకు రియా ఒంటరిగా దాని ముందు నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పలువురు ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు.

ఈ నేపథ్యంలో రియాకు ‘బిగ్‌బాస్‌ 20’లో పాల్గొనే అవకాశం లభించింది. అయితే ఆమెను షోలోకి పంపాలా? వద్దా? అనే నిర్ణయాన్ని నిర్వాహకులు ప్రేక్షకులకే అప్పగించారు. రియాతో పాటు పంజాబీ నటి లవ్‌ గిల్‌ పోటీలో నిలిచారు. వీరిద్దరిలో ఒకరిని షోలోకి పంపేందుకు ప్రేక్షకులు ఓటు వేయాల్సి వచ్చింది. ప్రజాభిప్రాయంలో లవ్‌ గిల్‌ విజయం సాధించారు. అధిక ఓట్లు రావడంతో ఆమె సల్మాన్‌ ఖాన్‌ షోలోకి ప్రవేశించారు. రియా మాత్రం నిరాశతో స్టేజ్‌ నుంచే తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

అయితే ఫలితం వెల్లడికాకముందే రియా, లవ్‌ గిల్‌ మధ్య వేదికపైనే వాగ్వాదం చోటుచేసుకుంది. సల్మాన్‌ ఖాన్‌ సమక్షంలో ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. బస్సును ఆపేంత ధైర్యం ఉందా అంటూ లవ్‌ చేసిన వ్యాఖ్యపై రియా స్పందిస్తూ.. తాను ఆపింది బస్సు కాదని, వ్యాన్‌ అని స్పష్టం చేశారు. డ్రైవర్‌ ఆపకపోతే రియా పరిస్థితి మరోలా ఉండేదని లవ్‌ వ్యాఖ్యానించారు. తన జీవిత ఉద్దేశం అక్కడే నెరవేరేదని రియా బదులిచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని సల్మాన్‌ ఖాన్‌ చూస్తూ ఉండిపోయారు. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నారు. చివరకు రియాకు ప్రేక్షకుల మద్దతు లభించలేదు. రెండు నిమిషాల్లోనే ఆమె షో నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి బాక్సింగ్‌ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement