చెరకు తోటల్లోనే పుట్టి, చెరకు తోటల్లోనే పెరిగి.. | Born in the Canes Why Indias Leopards Are Leaving Forests to Claim Farmlands | Sakshi
Sakshi News home page

చెరకు తోటల్లోనే పుట్టి, చెరకు తోటల్లోనే పెరిగి..

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 8:07 AM

Born in the Canes Why Indias Leopards Are Leaving Forests to Claim Farmlands

దట్టమైన అడవుల్లో విహరించాల్సిన వన్యమృగాలు ఇప్పుడు పంట పొలాలను శాశ్వత నివాసాలుగా మార్చుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోని చెరకు తోటలు చిరుతపులులకు కొత్త అడ్డాలుగా మారుతుండటంతో రైతులు, స్థానికుల గుండెల్లో గుబులు రేగుతోంది. ‘షుగర్‌కేన్ బేబీస్’గా పిలిచే ఈ చిరుతలు అడవుల కంటే చెరకు గడల చాటునే పుట్టి పెరిగి, అక్కడే వేట కొనసాగిస్తూ మానవ మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి.

అడవులను వీడి పొలాల బాట..
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, మురాదాబాద్‌లతో పాటు మహారాష్ట్రలోని చెరకు సాగు ప్రాంతాల్లో చిరుతల సంచారం తీవ్రస్థాయికి చేరింది. దట్టమైన చెరకు తోటలను ఈ మాంసాహార మృగాలు తమ సహజ అడవిగా భావిస్తూ అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. అక్కడ దాక్కుని మనుషులు, పెంపుడు జంతువులపై మెరుపు దాడులకు తెగబడుతున్నాయి. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2023 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,100కి పైగా చిరుతలు మరణించగా, అందులో 300కు పైగా మరణాలు మానవ-వన్యప్రాణి సంఘర్షణల వల్ల, రోడ్డు ప్రమాదాల వల్లే జరిగాయి.

బిజ్నోర్ ప్రజలకు కంటిమీద కునుకు కరవు
యూపీలోని బిజ్నోర్ జిల్లాలో చిరుతల సంచారం గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎప్పుడు ఏ పొదల్లోంచి చిరుత దాడి జరుగుతుందోనని ప్రజలు పొలాలకు వెళ్లడానికే జంకుతున్నారు. పరిస్థితి విషమించడంతో అటవీ శాఖ సిబ్బంది నిరంతరం ఆయుధాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్లపై వెళ్లేవారిని అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇక్కడి చిరుతల్లో చాలావరకు అసలు అడవినే చూడలేదు. అవి చెరకు తోటల్లోనే పుట్టి, అక్కడే జీవిస్తున్నాయి.

చెరకు గడల మధ్యే జీవనం.. వర్షాలతో సరికొత్త ముప్పు
చెరకు తోటల వాతావరణానికి ఈ చిరుతలు పూర్తిగా అలవాటుపడిపోయాయి. అయితే వర్షాకాలంలో తోటల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో, అవి తప్పనిసరి పరిస్థితుల్లో ఎత్తైన ప్రాంతాలు, సమీప గ్రామాల వైపు పరుగులు తీస్తున్నాయి. ఇది నేరుగా మానవులతో ఘర్షణకు దారితీస్తోంది. అటవీ అధికారులు గ్రామాలవారీగా లౌడ్‌స్పీకర్లతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బోన్లకు చిక్కని వైనం.. తప్పనిసరిగా మారిన కోళ్ల ఎర
గత నెల రోజుల్లోనే బిజ్నోర్‌లో చిరుతల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీటిని బంధించేందుకు అటవీ శాఖ 100కు పైగా బోన్లను ఏర్పాటు చేసింది. అయితే బోన్లలో ఎరగా కట్టిన మేకలను గ్రామాల్లోని కొందరు దొంగిలిస్తుండటంతో, అధికారులు ప్రత్యామ్నాయంగా కోళ్లను ఎరగా ఉంచాల్సి వస్తోంది. మరోవైపు థర్మల్ డ్రోన్ కెమెరాలు, నిఘా కెమెరాల సాయంతో చిరుతల కదలికలను గుర్తిస్తూ, దట్టమైన తోటల్లో సిబ్బంది ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నారు.

అడవిలో వదిలినా మళ్లీ తోటలకే..
గత ఐదేళ్లలో ఒక్క బిజ్నోర్ జిల్లాలోనే అటవీ శాఖ 146 చిరుతలను పట్టుకోగా, 103 చిరుతలు వివిధ కారణాలతో చనిపోయాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో 500కు పైగా చిరుతలు తిరుగుతున్నట్లు అంచనా. మానవ నివాసాల నుంచి పట్టుకున్న చిరుతలను రెస్క్యూ చేసి, సుదూర అడవుల్లో విడిచిపెడుతున్నప్పటికీ, అవి తమ జ్ఞాపకశక్తితో మళ్లీ పాత చెరకు తోటలకే తిరిగి చేరుకుంటున్నాయని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు వెల్లడించారు. బాణసంచా శబ్దాలు, డబ్బాల చప్పుళ్లను వింటూ పెరిగిన ఈ జంతువులు ఇప్పుడు సాధారణ శబ్దాలకు అస్సలు భయపడటం లేదు.

మహారాష్ట్రలో తీవ్రమవుతున్న ఆధిపత్య పోరు
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం పశ్చిమ మహారాష్ట్రలోని మొత్తం చిరుతల్లో సుమారు 70 శాతం అడవులను కాదని చెరకు తోటల్లోనే ఆవాసాలు ఏర్పరచుకున్నాయి. ఏదైనా ఒక చిరుత పట్టుబడినా లేదా మరణించినా, వెంటనే ఆ ప్రాంతాన్ని మరో చిరుత ఆక్రమించి తన సరిహద్దును పెంచుకుంటోంది. దేశంలో చెరకు విస్తారంగా పండే ప్రాంతాలన్నీ ఇప్పుడు చిరుతలకు సహజ ఆవాసాలుగా మారిపోతుండటంతో గ్రామీణ ప్రజలు, రైతుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

ఇది కూడా చదవండి: వరదల్లో అదృశ్యమై.. వారం తర్వాత వచ్చాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement